సంతబొమ్మాళి మండలం సీతానగరం మహిళలు ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఏజెన్సీ గ్రామం కాకపోయిన చీపుర్ల పరిశ్రమగా మారిపోయింది సీతానగరం గ్రామం. ఆ గ్రామానికి చెందిన బత్సల ధనలక్ష్మి కొండ చీపుర్ల తయారీ నేర్చుకుంది. తయారీని నేర్చుకున్న ఆ మహిళలు సొంతిట్లోనే వీటిని తయారు చేసుకుంటూ ఇరుగుపొరుగు వారికి కూడా తయారుచేసి ఇచ్చేది. ఇది అలా తన సేవలు పెరగడంతో ఇక విక్రయాన్ని ప్రారంభించింది. వారి భర్తలు సైతం చీపుర్లు తయారు చేయడం, భార్యలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.
వ్యాపారం సజావుగా సాగడంతో ప్రతినెలా చెప్పుకోదగ్గ రీతిలో ఆదాయాన్ని ఆమె ఆర్జిస్తున్నారు. అక్కడతో ఆగకుండా మరికొందరు మహిళలను చీపుర్ల తయారీ నేర్పించి కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకొని స్వశక్తిపై జీవిస్తూ తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మగవారికి ఏ మాత్రం తీసిపోని ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఆ మహిళల ఆదర్శ జీవనంపై స్వయం సహాయక సంఘాల రుణాలు, స్త్రీ నిధి రుణాలతో స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక స్వావలంబన దిశగా పలువురు మగువలు అడుగులు వేస్తున్నారు. గ్రామంలో 280 కుటుంబాలు ఉండగా ప్రస్తుతం 70కు పైగా కుటుంబాల మహిళలు చేతివృత్తిలా నిత్యం చీపుర్ల తయారీనే చేస్తుంటారు. ఒక చీపురు ధర డిజైన్ ఆధారంగా రూ.100 నుంచి 150 వరకు పలుకుతుంది. రోజుకు ఐదు నుండి పది చీపుర్లు సులువుగా కట్టి ఖర్చులు పోను రూ.800 పైబడి సంపాదిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో 100 మందికిపైగా చీపుర్లు తయారు చేస్తున్న మహిళలు ఉన్నారు. వీరు తయారు చేసిన చీపుర్లు మంచి ఆకర్షణగా, నాణ్యతగా ఉండడంతో బయట మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది. వీటిని మన జిల్లాతో పాటు, విజయనగరం, విశాఖపట్నం, ఒడిశా రాష్ట్రానికి ఎగుమతి చేస్తుంటారు.
సీజన్‌తో సంబంధం లేకుండా నిత్యం పెట్టుబడి పెట్టాల్సిన పరిశ్రమ కాబట్టి బయట నుంచి అప్పులు తెస్తే ఆర్థిక భారం అవుతుంది. కనుక ఈ పరిశ్రమను ప్రభుత్వం ప్రోత్సహించి మహిళా సంఘాలు, స్త్రీనిధి రుణాలను అవసరమైనపుడు సమయానికి అందించడం ద్వారా ఈ పరిశ్రమకు మరింత సహకారం అందించవచ్చు అంటుంది ఆమె.. ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న వైఎస్‌ఆర్ చేయూతతో ఇప్పటికే పలువురు మహిళలకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. డ్వాక్రా సంఘాల ద్వారా తయారైన ఉత్పత్తులను ఆలస్యం చేయకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే మరింత ఉపయోగం అంటుంది.
ఒకరితో మొదలై.. సీతానగరం ఊరంతా
బత్సల ధనలక్ష్మి ఉపాధి ఇవ్వడంతో ఆ గ్రామస్తులంతా మా ఇంట మహాలక్ష్మి అని ముద్దుగా పిలుస్తారు. పన్నెండేళ్ల కిందట బతుకుతెరువు కోసం అండమాన్ వలస వెళ్లగా అక్కడ ఉపాధి నిమిత్తం పలు ప్రాంతాల్లో తిరిగి ఒక కుటీర పరిశ్రమలో మూడు నెలలపాటు చీపుర్లు తయారీ నేర్చుకున్నానంటుందీ. అనంతరం స్వగ్రామానికి తిరిగివచ్చి చీపుర్లతోనే జీవనాధారం పొందడంపై సంతృప్తి చెందుతోంది. తన భర్త సోమేశ్వరరావు ప్రోత్సాహంతో సొంత గ్రామంలోనే ఏర్పాటు చేశానంటుంది. మొదట్లో కాస్త పెట్టుబడి పెట్టి శ్రీముఖ లింగం, మెళియాపుట్టి ప్రాంతాల నుండి వీటికి కావాల్సిన కుంచె, నార, తాడును తెచ్చి చీపుర్లు కట్టేదానని అది చూసిన చుట్టుపక్క మహిళలు ఆసక్తితో ఆమె ఇంటికి వెళ్లి, ఆమెతో పాటు పని చేస్తూ చీపుర్లు కట్టడం నేర్చుకోవడంతో వ్యాపారంగా మారింది. అనతికాలంలోనే ఆ చీపుర్లకు మంచి గిరాకీ లభించడంతో ఈ కుటీర పరిశ్రమ ఎంతో మందికి జీవనాధారంగా మారింది. అండమాన్‌లో ఒక కుటీర పరిశ్రమలో చీపర్లు తయారీ ఇపుడు ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి దోహదపడడం ఆనందంగా ఉందని ధనలక్ష్మి చెబుతుంది.