ఏపీలో ప్రతీ నియోజకవర్గాన్నీ టచ్ చేస్తూ ఒక బైక్ ర్యాలీని చేపట్టడానికి ఏపీ బీజేపీ సన్నద్దమైంది. యువచైతన్య యాత్ర పేరుతొ సాగే ఈ ర్యాలీ ఆగస్టులో ప్రారంభంకానుంది. విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో జరిగిన బీజేపీ కొర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిరుద్యోగ విధానాలను ప్రజల్లోకి, ముఖ్యంగా యువతలోనికి తీసుకెళ్లేలా ఈ యాత్ర చేపడుతున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏపీలోని 4 జోన్‌లలో 4 బహిరంగ సభలతోపాటు, విజయవాడలో భారీ సభ ఉండేలా ఈ ర్యాలీని ప్లాన్ చేస్తున్నారు రాష్ట్రబీజేపీ నేతలు. అలాగే వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేకమంది కీలక నేతలను పార్టీలో చేర్చుకునే కార్యక్రమా న్ని కూడా త్వరలో రూపొందించబోతున్నట్టు కోర్ కమిటీ మీటింగ్‌లో చర్చించారు. అలాగే జూలై 4న ప్రధాని మోదీ ఏపీలో పర్యటిస్తున్న నేపథ్యంలో దానిపై కూడా కోర్ కమిటీ చర్చ జరిపింది.
ఏపీలో 2024 నాటికి బలపడేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపైనా వారు చర్చ జరిపారు. ముఖ్యంగా యువతను, మహిళలనూ, బలహీన వర్గాలను పెద్దఎత్తున పార్టీ వైపు ఆకర్షించేలా పార్టీని వాళ్ళలోకి తీసుకెళ్లాలని కొర్ కమిటీ చర్చించింది. ఇక పార్టీ బలోపేతానికి ఏపీలో అసెంబ్లీ స్థాయిలో కమిటీలు వెయ్యాలని, వాటిని చురుకుగా ఉండే కార్యకర్తలు, నాయకులతో నింపాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.
పొత్తులపై జులై 2,3, తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో చర్చ
ఇక తెలుగు రాష్ట్రాల్లో పొత్తు లపై జులై 2, 3 తారీఖుల్లో హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో ప్రాథమికంగా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా బీజేపీ నేతలు తెలిపారు. అలాగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రానున్న రోజుల్లో ఏపీలోని 9 కీలక పార్లమెంట్ నియోజక వర్గాల్లో కేంద్రమంత్రులు పర్యటి స్తారని కోర్ కమిటీ తెలిపింది. వీటితోపాటు పార్టీ సంస్థాగత అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా ఈ కోర్ కమిటీ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ దియోధర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సహా కీలక బీజేపీ నాయకులు పాల్గొన్నారు .