అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో ఉన్న సెజ్‌ (Atchutapuram SEZ)లో మరోసారి గ్యాస్ లీక్ కావడంతో దాదాపు యాభై మంది వరకు అనారోగ్యం పాలయ్యారు. 
కేవలం రెండు నెలల్లోనే ఇలాంటి ఘటన రెండోసారి జరగడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఏపీ సీఎం వైఎస్ మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారని, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడంలేదని విమర్శించారు. రెండు నెలల వ్యవధిలోనే రెండుసార్లు గ్యాస్ లీకేజ్ ఘటనలు జరిగాయంటే ప్రజల ప్రాణాల పట్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిది లెక్క లేనితనమని స్పష్టమవుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుంటున్న ప్రజలు..
విశాఖ‌ప‌ట్నంలో జే గ్యాంగ్‌ క‌బ్జాలు, దౌర్జన్యాలు, ప్రమాదాలు, విష‌ర‌సాయ‌నాల లీకుల‌తో ప్రజ‌లు తమ ప్రాణాలు అర‌చేతిలో ప‌ట్టుకుని బ‌తుకుతున్నారని నారా లోకేష్ అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎల్జీ పాలీమ‌ర్స్ మ‌ర‌ణ‌మృదంగం, సాయినార్ ఫార్మా విషాదం మ‌రువ‌క‌ముందే, అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌ సీడ్స్ కంపెనీలో రెండోసారి విష‌వాయువులు లీకై వంద‌ల‌ మంది మ‌హిళ‌లు తీవ్ర అస్వస్థత‌కి గురి కావ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగించిందన్నారు.






ప్రాణాలు పోయినా ఫర్వాలేదు, కమీషన్లు అందితే చాలు !
ఉపాధి కోసం ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వ‌చ్చిన మ‌హిళల‌ ప్రాణాలు పోయినా ఫ‌ర్వాలేదు... కానీ క‌మీష‌న్లు నెల‌నెలా అందితే చాల‌ు అన్నట్టుంది వైఎస్ జగన్ ప‌రిపాల‌న‌ అని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చ‌నిపోయాక ప‌రిహారం ఇవ్వడం కాదని, వాళ్లు బ‌తికేలా ర‌క్షణ చ‌ర్యలు తీసుకోవడమే అసలైన ప్రభుత్వ బాధ్యత అని ఏపీ సీఎం జగన్‌కు లోకేష్ హితవు పలికారు. 


అసలేం జరిగిందంటే.. 
అచ్యుతాపురంలో ఉన్న సెజ్‌లోని జూన్ మూడో తేదీన తొలిసారి విష వాయులు లీక్ కావడంతో మూడు వందల మంది అస్వస్థతకు గురయ్యారు. దీనిపై అధికార ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా స్పందించారు. దీంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. విషయవాయువు లీక్ కావడానికి కారణాలు తెలుసుకునే కంపెనీ మూసి వేస్తున్నట్టు ప్రకటించారు. నిపుణల కమిటీ వచ్చి పరిశ్రమను పరిశీలించి నివేదిక ఇచ్చేవరకు కంపెనీ మూసివేయాలని అధికార పార్టీ ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు డిమాండ్ చేశారు. సరిగ్గా 2 నెలలకు అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విష వాయువు లీక్‌ అయింది. మంగళవారం సాయంత్రం అందులో పనిచేసేవారు ఒక్కొక్కొరుగా వాంతులు, వికారంతో స్పృహ తప్పి పడిపోయారు. వారిని అంబులెన్స్‌లలో ఆసుపత్రికి తరలించారు. అనంతరం అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
Also Read: Visakhapatnam Gas Leak: అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విషవాయువులు లీక్- యాభై మందికి అస్వస్థత


Also Read: రెండు నెలల్లోనే రెండో ప్రమాదం- అచ్యుతాపురం సెజ్‌లో ఏం జరుగుతోంది?