జూన్ మూడు... అంటే కరెక్ట్‌గా రెండు నెలల క్రితం... అదే పరిశ్రమలో అదే ప్రమాదం. అప్పుడు మూడు వందల మంది అస్వస్థతకు గురైతే ఇప్పుడు యాభై మంది అనారోగ్యం పాలయ్యారు. అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్ పరిశ్రమలో తరచూ జరుగుతున్న ప్రమాదాలు కలవరానికి గురి చేస్తున్నాయి.
రెండు నెలల క్రితం ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసిన ప్రభుత్వ యంత్రాంగం తర్వాత సైలెంట్ అయిపోయింది. తాత్కాలికంగా ఫ్యాక్టరీ మూసివేసి... అప్పుడు జరిగిన దుర్ఘటనపై ప్రత్యేక విచారణకు ఆదేశించారు. తర్వాత ఆ విచారణ ఏమైందనేది బయటకు రాలేదు. ఇంతలోనే మరోసారి గ్యాస్ లీక్ అవ్వడంతో అనేక అనుమానాలు నెలకొన్నాయి.
అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో ఉన్న సెజ్‌లోని జూన్ మూడో తేదీ సాయంత్ర ఇలాంటి ప్రమాదమే జరిగింది. విష వాయులు లీక్ కావడంతో మూడు వందల మంది అస్వస్థతకు గురయ్యారు. దీనిపై అధికార ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా స్పందించారు. దీంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. విషయవాయువు లీక్ కావడానికి కారణాలు తెలుసుకునే కంపెనీ మూసి వేస్తున్నట్టు ప్రకటించారు.
నిపుణల కమిటీ వచ్చి పరిశ్రమను పరిశీలించి నివేదిక ఇచ్చేవరకు కంపెనీ మూసివేయాలని అధికార పార్టీ ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు డిమాండ్ చేశారు. ఆయనతోపాటు మంత్రి అమర్‌నాథ్, ఎంపీ డాక్టర్ సత్యవతి కంపెనీలోకి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో కంపెనీ ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. గ్యాస్ లీక్ పై ఆరా తీశారు.
పరిశ్రమ అధికారులతో మాట్లాడిన మంత్రి అమర్‌నాథ్... లీకేజీపై స్పష్టత రాలేదని తేల్చారు. దీంతో ఏపీఐఐసీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రెండు కంపెనీల్లో ఉద్యోగులే ఎక్కువగా అస్వస్థతకు గురయ్యారన్నారు. విషవాయువులు ఎక్కడ నుంచి వ్యాపించాయన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.
ఇదంతా జరిగినప్పటికీ ఆ కమిటీ ఏం తేల్చింది. కంపెనీ మళ్లీ ఎప్పుడు తెరిచారన్న విషయం మాత్రం బయటకు రాలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అప్పుడే కఠినమైన చర్యలు తీసుకునే ఉంటే మరోసారి ప్రమాదం జరిగేందుకు ఆస్కారం ఉండేది కాదన్నది వారి వాదన. ఇలా అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి దుర్ఘటన తరచూ జరుగుతున్నాయన్నది ప్రతిపక్షాల విమర్శ. రెండు ప్రమాదాలు జరిగిన కంపెనీపై కేసులు పెట్టకపోవడాన్ని తప్పుపడుతున్నాయి విపక్షాలు.
అందుకే ఇలాంటి ప్రమాదాలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం క్లియర్‌గా కనిపిస్తుందని విమర్శలు చేస్తున్నాయి.