AP Latest News: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లో (స్పెషల్ ఎకనమిక్ జోన్) జరిగిన ప్రమాద ఘటనలో చనిపోయిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఘటన జరిగిన సోమవారం మధ్యాహ్నం ఒకరు చనిపోయినట్లుగా వార్తలు రాగా.. రాత్రి సమయానికి ఏకంగా 15 మంది చనిపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు. మరో 30 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురంలో ఫార్మా సెజ్‌ ఉంది. ఇందులో ఎసెన్షియా ఫార్మా అనే కంపెనీ ఉంది. ఇందులో రియాక్టర్ పేలింది. రియాక్టర్‌లోని ఇన్‌ఫ్లేమబుల్ సాల్వెంట్ మండడం కారణంగా రియాక్టర్ పేలినట్లుగా చెబుతున్నారు. ఈ ఘటనలోనే 15 మంది మృతి చెందారు. రియాక్టర్ పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. పరిశ్రమ భవనం దెబ్బతిని గోడ కూడా కూలినట్లుగా తెలుస్తోంది. ఆ శిథిలాల కింద కూడా కార్మికులు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.


నేడు చంద్రబాబు పర్యటన


ప్రమాదం జరిగిన సెజ్‌ను చంద్రబాబు ఇవాళ (ఆగస్టు 22) సందర్శించనున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించడంతో పాటుగా చనిపోయిన వారి కుటుంబాలను, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను చంద్రబాబు పరామర్శించనున్నారు. ఇప్పటికే సీఎం అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు అనకాపల్లి కలెక్టర్ తో మాట్లాడారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తశారు. క్షతగాత్రులకు త్వరితగతిన వైద్యం అందాలని, అవసరమైతే ఎయిర్ ఆంబులెన్స్‌లు వాడి విశాఖపట్నానికి లేదా హైదరాబాద్ కు తరలించాలని చంద్రబాబు సూచించారు.


ఘటనా స్థలానికి హోం మంత్రి


ఘటన తీవ్రత అధికంగా ఉండడంతో హోం మంత్రి వంగలపూడి అనిత హుటాహుటిన అచ్యుతాపురానికి బయలుదేరారు. విజయవాడలో బుధవారం తన శాఖపై సీఎం సమీక్షలో పాల్గొన్న ఆమె.. హుటాహుటిన అచ్యుతాపురానికి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు. ఫార్మా కంపెనీ ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించి, మృతుల కుటుంబాలను హోం మంత్రి పరామర్శించనున్నారు.


మృతుల వివరాలు..
వి. సన్యాసినాయుడు
రామిరెడ్డి, ల్యాబ్ హెడ్ 
హారిక కెమిస్ట్ 
పార్థసారథి, ప్రొడక్షన్ ఆపరేటర్ 
వై. చిన్నారావు, ప్లాంట్ హెల్పర్ 
పి.రాజశేఖర్
మోహన్, ఆపరేటర్ 
గణేష్, ఆపరేటర్ 
హెచ్. ప్రశాంత్ 
ఎం. నారాయణరావు.. 


మరికొంత మంది వివరాలు తెలియాల్సి ఉంది.


అచ్చుతాపురం ఏపీ సెజ్‌లో ప్లాట్ నెంబర్ 11, 11ఏ, 12, 12ఏలో ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఈ ఎసెన్షియా ఫార్మా కంపెనీలో వందల మంది కార్మికులు పని చేస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ సమయంలో రియాక్టర్ పేలుడు సంభవించింది. దట్టంగా పొగ అలుముకోవడమే కాక, మంటలు చెలరేగాయి. కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. మొత్తం 12 ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి.