Vizianagaram TDP politics : విజయనగరం జిల్లా తెలుగుదేశం రాజకీయం బంగ్లా నీడలోనే నడిచేది. అటువంటి చోట తొలిసారి ధిక్కార స్వరం ప్రతిధ్వనించింది. ధ్వనించడమే కాదు అశోక్ నాయకత్వాన్ని ( Ashok Gajapti  raju ) బహిరంగంగా సవాలై నిలిచింది. అక్కడకే పరిమితం కాలేదు. బస్తీమే సవాల్ అన్నట్లు సమీపంలోనే మరో కార్యాలయం కూడా తెరుచుకుంది. వీటన్నింటి రీత్యా ఎన్నడూ లేనంతగా టి.డి.పి. బలహీనంగా కనిపించడం అనివార్యమయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికలలో టి.డి.పి. ఉనికే ప్రశ్నార్ధకంగా మారిపోయింది. ఈ పరిణామాలు అన్నింటి వలనే టి.డి.పి.లో అభ్యర్థి ఎవరు అన్న అంశం తెరమీదకి వచ్చేటట్లు చేసింది. అందరూ చర్చించుకునే అవకాశాన్ని కల్పించింది. ఒక పక్క విజయనగరం పార్టీ ఇన్ చార్జ్ గా అధితి గజపతిరాజు కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా అశోక్ గజపతిరాజు నిలుస్తారని పార్టీ శ్రేణులు నమ్ముతున్నారు. ఇంకో పక్క బి.సి. కార్డుతో మీసాల గీత టిక్కెట్ కోసం పోటీలో నిలిచారు. ఇలా ముగ్గురు టి.డి.పి. చిత్రంలో రక్తికట్టిస్తున్నారు. ఇంతకూ అభ్యర్ధి ఎవరు అన్నది మాత్రం ప్రస్తుతానికి ఓ ప్రశ్నే!? 


విజయనగరం టీడీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానన్న అధితి గజపతిరాజు


అధితి గజపతిరాజు భవిష్యత్ కి గ్యారంటీలో భాగంగా ఇంటింటి ప్రచారంలో షాక్ ఇచ్చే ప్రకటన చేశారు. అశోక్ గజపతిరాజు కుమార్తె అధితి గజపతిరాజు విజయనగరం అభ్యర్థి అని మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ ప్రసాదుల కనక మహలక్ష్మీ తమ వార్డు పరిధిలో ఓ అవ్వకి పరిచయం చేశారు. ఆ క్రమంలోనే “ఎమ్మెల్యేగా నేనే పోటీచేస్తున్నా” అని ఆమె పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకోవడమే కాదు. గడిచిన నెల రోజులుగా రాజకీయంగా ఆమె యాక్టివేట్ అయ్యారు. పార్టీ కార్యక్రమంలోనే కాదు. ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళనల్లో కూడా భాగస్థులవుతున్నారు. పార్టీసమావేశాలలో అగ్రస్థానంలో నిలుస్తున్నారు. కొద్ది కాలం విరామం తరువాత ఆమె క్రియాశీలకంగా మారారు. దీంతో ఆమె ప్రకటించుకున్న విధంగా తానే అభ్యర్థి అన్న సంకేతాలను ఇచ్చారు. ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు. 


ఎన్నికల్లో ఓటమి తర్వాత మారిన అశోక్ గజపతి రాజకీయాలు


సరిగ్గా ఈ ప్రకటనే ఇప్పుడు విజయనగరంలో సంచలనంగా మారింది. రేపటి ఎన్నికలలో ఎవరిని టిక్కెట్ వరిస్తుందో ఎవరూ చెప్పుకోలేని అయోమయ పరిస్థితి. అలాంటి స్థితిలో అధితి గజపతిరాజు చేసిన ప్రకటన రాజకీయంగా హెూరెత్తిస్తోంది. ఇన్ చార్జ్ లుగా కొనసాగుతున్న వారిలో అవసరమైతే కొంత మందిని మార్చుతామని చంద్రబాబు గతంలో ఇచ్చిన సంకేతాలు ఉండనే ఉన్నాయి. ఏ చోట అభ్యర్థి ఎవరో కనీస స్థాయిలో కూడా లీకులకు తావులేని పరిస్థితి కొనసాగుతోంది. దీనికి ప్రధాన కారణం పొత్తు రాజకీయాలే అన్నది సుస్పష్టం.పొత్తులు ఇంకా పొడవకముందే, సీట్లు సర్దుబాటు కాకముందే తనకి తానుగా తానే ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నానని చెప్పడం వైరల్ గా మారడం సహజం. అధిష్టానం నుంచి గానీ, అశోక్ గజపతిరాజు నుంచి గానీ ఎటువంటి ప్రకటనా ఇప్పటికైతే వెలువడలేదు. కాని, పార్టీ ఇన్ చార్జ్ గా ఉన్న అధితి స్వయం ప్రకటన అనేక ఆలోచనలకి, విశ్లేషణలకు తావిచ్చింది. ఇప్పటికీ తావిస్తూనే ఉంది. వాస్తవానికి ఆమెనే ఎన్నికల బరిలో నిలపాలని పార్టీ నిర్ణయించుకుందా? లేక మరొక గొంతకు తావు లేకుండా నిరోధించే వ్యూహమా ? అన్నది ప్రస్తుతానికి ఊహాగానంగానే ఉంది. మొన్నటి ఎన్నికలలో అధితి గజపతిరాజు, అశోక్ గజతిరాజు ఓటిమి పాలుకావడంతో బంగ్లాలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కొంత మందిని దూరం పెట్టారు. 


మీసాల గీతకు ఓ వర్గం మద్దతు 


అధితి నాయకత్వం ఇష్టం లేని వారు  మీసాల గీతకి అండగా నిలిచారు. ఆమెతో నడుస్తున్నారు. ఆమె ప్రత్యేకంగా కార్యాలయం తెరిచారు. దీంతో మీసాల గీత తెరిచిన కార్యాలయంలో హడావిడి మొదలయ్యింది. ఈ క్రమంలోనే బి.సి. నినాదం పార్టీలో చాపకింద నీటిలా నడిపేందుకు పావులు కదిలాయి. అస్వస్థత నుంచి తేరుకున్న అశోక్ గజపతిరాజు పార్టీని చక్కదిద్దే చర్యలు చేపట్టారు. ప్రధాన సామాజిక వర్గాలకు పార్టీ కమిటీలకు సారధుల్ని చేశారు. ఆ మేరకు గీతకి చెక్ చెప్పారు.   పార్టీ ఇన్ చార్జ్ గా అధితి గజపతిరాజు కొనసాగించారు. అశోక్ గజపతిరాజే స్వయంగా వ్యవహారాలను నడుపుతున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం పరిస్థితుల్లో అసెంబ్లీ బరిలో అశోక్ గజపతిరాజు నిలుస్తారన్న ప్రచారం   సాగింది.అయినా, మీసాల గీత వర్గం మాత్రం పునరాలోచన చేయలేదు. కార్యాలయ తలుపులు మూయలేదు. బి.సి. సమావేశాలలోనూ, అధిష్టానానికి అందుబాటులోనూ ఉంటూ వస్తున్నారు. మొన్నటి చంద్రబాబు అరెస్టుకి వ్యతిరేకంగా వేరే వర్గంగా ప్రజల్లోకి వెళ్లారు. మీడియా సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు.


ఇంకా క్లారిటీ ఇవ్వని హైకమాండ్ 


 ఇటువంటి వాతావరణంలో అసెంబ్లీ బరిలో తానే నిలుస్తున్నట్లుఅధితి గజపతిరాజు తేల్చేశారు. ప్రకటించడమే కాదు పూర్తి స్థాయిలో క్రియాశీలంగా మారారు. ప్రజాందోళనలకు మద్దతుగా నిలుస్తున్నారు. పార్టీ సమావేశాలలో ముందు భాగాన కనిపిస్తున్నారు. మరో ఆలోచనలకి, మరో వాదనలకీ తావు లేకుండా చేశారు. చూసిన వారికి అభ్యర్థి ఆమెనేమో అనిపించేంతగా పరిస్థితి మొత్తాన్ని మార్చేశారు. ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. నిజంగానే ఆమె బరిలో నిలుస్తున్నారా? లేక బయట జరుగుతున్న చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టాలని వ్యూహం పన్నారా ? అన్నది తేలాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో బంగ్లాకూ, గీత కార్యాలయానికి మధ్య అటూ, ఇటూ నడిచే వారి అధికమవుతున్నారు. అటువంటి ఊగిసలాటలకి తావులేకుండా చేయాలని అధితి వచ్చినట్లు ఆమె ప్రకటన చెప్పకనే చెబుతోంది. ఒక అడుగు ఇటు, మరో అడుగు అటు వేస్తున్న నాయకులకు ఎటో తేల్చుకోవాలని చెప్పినట్లుగానూ అర్ధమవుతుంది. దీంతో బంగ్లాలో ఇప్పటికే మసులుతున్న వారికీ, గీత ఆవరణంలో ఉన్న వారికి ఒక క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది. అదే నిజమైతే విజయనగరంలో రాజకీయం ఎలా ఉంటుందో?!