Anganwadi And Muncipal Workers Protest : మూడు వారాలుగా అంగన్వాడీ సిబ్బంది (Anganwadi Workers) వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. డిమాండ్లు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. కనీస వేతనం ఇచ్చే వరకు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ (Retirement Benifits) కల్పించే వరకు సమ్మె విరమించబోమని కార్మికులు, ఉద్యోగులు చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్లను ముట్టడించారు. రోజుకో విధంగా నిరసనలు తెలియజేస్తున్నారు.


పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు...సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా  స్పందించే వరకు విధులకు హాజరయ్యేది లేదని హెచ్చరిస్తున్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో విద్యుత్, ఇతర విధులు నిర్వర్తించే కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులకు అదనంగా అందించే రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులకు కార్మిక సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ సంఘాలు బాసటగా నిలిచాయి.  ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. 



ఉద్యమా సెగ తగ్గించే ప్లాన్  
అంగన్వాడీల ఉద్యమ సెగను తగ్గించే ప్లాన్ లో ఉంది ప్రభుత్వం. ఈనెల 5వ తేదీ లోగా విధులకు హాజరురావాలని అంగన్వాడీలకు ప్రభుత్వం అల్టీమేటం జారీ చేసింది.  ప్రభుత్వ విజ్ఞప్తి పేరుతో నోటీసులు పంపిన సర్కార్, సమ్మె వల్ల ఇబ్బందులను నోటీసులో పేర్కొన్నారు. అయినప్పటికి అంగన్వాడీ ఉద్యోగులు, కార్మికులు మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు. కలెక్టర్లు నోటీసులు పంపినా అంగన్వాడీలు ఆందోళనను మాత్రం ఆపడం లేదు. తాడో పేడో తేల్చుకోవాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం తమకు అల్టిమేటం జారీ చేయడంపై అంగన్వాడి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనాలు ఇచ్చేవరకు, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించే వరకు సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీలు స్పష్టం చేశారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.  అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్స్, శానిటేషన్ వెహికల్ డ్రైవర్స్, మలేరియా వర్కర్స్ కు నెలకు 6 వేల రూపాయల ఓహెచ్ అలవెన్స్ ఇస్తూ జీవో జారీ చేసింది. సమాన పనికి సమాన వేతనం, కార్మికుల రెగ్యులరైజేషన్, పబ్లిక్ హెల్త్ పరిధిలో వచ్చే వాళ్లల్లో కొంతమందికే రూ. 6 వేల అలవెన్స్ ప్రకటించారు. మిగతా కార్మికులు ఏం పాపం‌ చేశారని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 


ప్రభుత్వం ముందున్న ఆప్షన్లు ఏంటి ?
అల్టిమేటం జారీ చేసినా, నోటీసులు పంపినా అంగన్వాడీలు వెనక్కి తగ్గకపోవడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. సమ్మె చేస్తున్న అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉంది. అంగన్వాడీలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న వాటిలో కొన్నింటికి ఆమోదముద్ర వేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అసలే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో, దీన్ని ఇంకొంతకాలం సాగదీయకుండా ఉండాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. కనీస వేతనం, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ విషయంలో సర్కార్ పట్టువిడుపులకు వెళ్లనున్నట్లు సమాచారం.  అటు మున్సిపల్ కార్మికుల డిమాండ్లలోనూ కొన్నింటి పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల వేళ ప్రజల్లో, ఉద్యోగుల్లో వ్యతిరేక భావం ఏర్పడకుండా ఉండేలా వ్యూహాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల చేస్తున్న డిమాండ్లు పరిష్కరించాలంటే ఎంత ఖర్చవుతుంది ? బట్జెడ్ లో ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుందన్న దానిపై లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం. అన్ని డిమాండ్లు కాకపోయినా మధ్యే మార్గంగా కొన్నింటికి పరిష్కారం చూపేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.