AP Minister Gudivada Amarnath: విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య లేఖ రాయడాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తప్పుపట్టారు. సీనియర్ ప్యాకేజి స్టార్ హరిరామ జోగయ్య అని వ్యాఖ్యానించారు. ఆయన భూమికి భారం అంటూ తీవ్రమైన వ్యాఖ్యలతో సీనియర్ నేతపై నిప్పులు చెరిగారు మంత్రి అమర్నాథ్. పెన్ను పట్టుకునే శక్తి లేదు.. సరిగా మాట్లాడలేడు.. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద లేఖాస్త్రాలు సంధించడానికి సిద్ధమవుతుంటాడు.. అతడే సీనియర్ ప్యాకేజి స్టార్ హరిరామ జోగయ్య అని సెటైర్లు వేశారు.


సీఎం జగన్ ను హరిరామ జోగయ్య రాసిన లేఖపై స్పందించిన అమర్నాథ్ ఆయనకు లేఖతోనే బదులిచ్చారు. అనంతరం విశాఖలో అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. జోగయ్యకు వయసు మళ్ళిందని, తన కంటే 50 ఏళ్లు పెద్దవారు అంటూనే ఆయన భూమికి భారం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నలుగురికి చెప్పాల్సిన వయసులో సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ చిల్లర భాషతో ఆయన రాసిన లేఖ తీవ్ర అభ్యంతరకరంగా ఉందని అన్నారు. ఎవరో రాసిన స్క్రిప్ట్ మీద డబ్బులు తీసుకుని జోగయ్య సంతకం పెట్టినట్టుగా భావిస్తున్నామని మంత్రి అమర్నాథ్ అన్నారు. 
ఎల్లో మీడియా, మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను మెప్పించడానికి రాసినట్టు హరిరామ జోగయ్య లేఖ ఉందని ఆయన విమర్శించారు. పబ్లిసిటీ కోసమే సీనియర్ నేత అశ్లీల భాషలో లేఖ రాశారని, దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. హరి రామ జోగయ్యను ఎవరూ ఏమీ అనలేదని, ఆయనకు సంబంధించిన అంశాలు లేకున్నా జోక్యం చేసుకోవడాన్ని మంత్రి తప్పుపట్టారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీని ముంచేసి బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి మీద తప్పుడు విమర్శలు చేసిన జోగయ్య నమ్మకద్రోహి అని అమర్నాథ్ అన్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial