కసింకోట: " మీ కుటుంబాలకు నా తరఫున మంచి జరగకపోతే ఓటు వేయద్దు" అని సీఎం జగన్ ఈ మాట చెప్పారంటే... జనంలో ఆయనకు బలం ఉంది కాబట్టే అంత ధైర్యంగా ఆ మాట చెప్పారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్నిటినీ నెరవేర్చారు కాబట్టే ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికలలో వైసీపీకి 175 కి 175 సీట్లు గెలుస్తామన్న మనో నిబ్బరంతో జగన్ ఉన్నారని అన్నారు. డ్వాక్రా మహిళల రుణమాఫీ కోసం ప్రవేశపెట్టిన ఆసరా పథకం కింద కసింకోట మండలంలో 13 కోట్ల 31 లక్షల రూపాయల చెక్కును డ్వాక్రా మహిళలకు బుధవారం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. జనానికి మేలు చేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఓటు అడుగుతున్నారని, చంద్రబాబు తన పదవీకాలంలో ప్రజలకు ఏం మేలు చేశాడని ఓటు అడగడానికి వస్తున్నాడని ప్రశ్నించారు. గత ఎన్నికలకు ముందు పసుపు, కుంకుమ కింద డబ్బులు బ్యాంకులో జమ చేస్తున్నామని చెప్పిన చంద్రబాబు ఆ మొత్తాన్ని డ్వాక్రా మహిళలు వినియోగించుకోలేని విధంగా ఆదేశాలు జారీ చేశాడంటే ఆయన ఎంత మోసగాడో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
175 స్థానాల్లో చంద్రబాబు పోటీ చేస్తారా?
పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు మోసం చేస్తే... ఉప్పు, కారంతో ఆయనకు మహిళలు బుద్ధి చెప్పారని అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా లేక వివిధ పార్టీలతో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడని, అటువంటి వ్యక్తి గురించి జనం ఆలోచించాల్సిన అవసరం లేదని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. జనానికి మేలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న విపక్షాలు చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మొద్దని గుడివాడ అమర్నాథ్ కోరారు.
పేద, బడుగు, బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రెండు లక్షల 96 వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని, స్వతంత్ర వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని పాలించిన ఏ ముఖ్యమంత్రి అయిన ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేశారా? అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 65 లక్షల మందికి ప్రతి నెల ఇళ్లకే పింఛన్ అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు.
కసింకోటలో ఆ ప్రభుత్వం 600 కు పైగా ఇళ్ల పట్టాలని అందజేసిందని, గతంలో ఎవరైనా ఇంత సాహసం చేశారా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో పేద ప్రజలు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుందన్న ఉద్దేశంతో సీఎం పేదల అభ్యున్నతి కోసం శ్రమిస్తున్నారని అన్నారు. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో తనను అనకాపల్లి నియోజకవర్గం నుంచి గెలిపించి జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసే అవకాశం కల్పించినందుకు ఈ ప్రాంత ప్రజలకు అమర్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తిరిగి అధికారులకు తీసుకురావాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతిపక్షనేతగా జగన్ తన పాదయాత్రలో డ్వాక్రా మహిళల రుణ బాధలను తెలుసుకొని, ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించే కార్యక్రమంలో భాగంగానే ఆసరా పథకాన్ని అమలు చేశారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి, అమర్నాథ్ కు ఈ ప్రాంత ప్రజలు అండగా ఉండాలని ఆయన కోరారు. కసింకోట ఎంపీపీ కలగా లక్ష్మీ గున్నయ్య నాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుత సంక్షేమ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలో తీసుకువచ్చే బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు.
ఈ కార్యక్రమానికి కలగా గున్నయ్య నాయుడు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో కసింకోట జడ్పిటిసి శ్రీధర్ రాజు, జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి బుల్లిబాబు, గొలవెల్లి శ్రీనివాసరావు, మనసాల కిషోర్ ఎంపీపీలు నమ్మి మీనా గణేష్, పెంటకోట జ్యోతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.