- కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో మంత్రి అమర్నాథ్ భేటీ
- రాష్ట్ర ప్రభుత్వ సహాయక చర్యలను అభినందించిన మంత్రి వైష్ణవ్
విశాఖపట్నం: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం మధ్యాహ్నం కటక్ లోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో భేటీ అయ్యారు. ఒడిశాలోని బాలాసోర్ లో రెండు రోజుల కిందట జరిగిన రైలు ప్రమాదం దుర్ఘటనపై వీరిద్దరూ కొద్దిసేపు చర్చించుకున్నారు. ఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యల గురించి మంత్రి అమర్నాథ్ కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని, బంధువుల ఆచూకీ తెలియని వారు, వారి ఫోటోలు నేరుగా కంట్రోల్ రూమ్ కు వాట్సాప్ ద్వారా పంపిస్తే, సదరు వ్యక్తుల సమాచారాన్ని బంధువులకు వీలైనంత త్వరగా అందజేసే ప్రక్రియను చేపట్టామని అమర్నాథ్ మంత్రి అశ్విని వివరించారు.
ఏపీ సీఎంకు కేంద్ర మంత్రి అభినందనలు..
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. గతంలో రైలు ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం రైల్వే శాఖ మాత్రమే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడాన్ని తాను తొలిసారిగా వింటున్నానని చెప్పారు. ఇటువంటి సహాయక చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాను అభినందిస్తున్నానని వైష్ణవ్ చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తన వెంట ఉన్న అధికారులను పిలిచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలపై వివరాలు నమోదు చేసుకోవాలని అశ్విని సూచించారు. అలాగే ఘటన జరిగిన వెంటనే ముగ్గురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి సహాయక చర్యలలో నిమగ్నం చేయడం పట్ల కూడా కేంద్ర మంత్రి అభినందించారు.
ఈ దశలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. 342 మంది ప్రయాణికులను స్వల్ప వ్యవధిలోనే గుర్తించామని, చనిపోయిన వ్యక్తిని కూడా గుర్తించి అతని మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించి ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించామని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సత్వర చర్యలు పట్ల కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యల వలన బాధితులను త్వరితగతిగా గుర్తించడమే కాకుండా, మరణాల సంఖ్యను కూడా తగ్గించడానికి వీలవుతుందని అశ్విని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు.
అనంతరం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఒడిశాలో రైలు ప్రమాద దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు చాలావరకు సురక్షితంగా బయటపడినట్టు కేంద్ర రైల్వే మంత్రికి చెప్పానని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లలో తమ వారి వివరాలు తెలుసుకునేందుకు పెద్దగా ఎవరూ రానందున క్యాజువాలిటీస్ పెరిగే అవకాశం లేదని అశ్విని వైష్ణవ్ కు వివరించామని అమర్నాథ్ చెప్పారు.
డిజిటలైజేషన్ పురోగతిలో ఉన్న సమయంలోనూ ఇటువంటి ప్రమాదాలు జరగటం దురదృష్టకరమని ఏపీ మంత్రి అన్నారు. భారతీయ రైల్వే వందే భారత్ వంటి అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్న సమయంలో ఇంత ఘోర ప్రమాదాన్ని నివారించడంలో రైల్వే శాఖ ఎలా విఫలమైందో అర్థం కావడం లేదన్నారు.
Also Read: Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి