Chandrababu About Free Bus travel for Women: విజయనగరం: తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏజీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఏపీలో అధికారంలోకి వచ్చేది టీడీపీ, జనసేన ప్రభుత్వమేనన్నారు. త్వరలోనే అమరావతి, తిరుపతిలో సభలు పెడతాం. అందులో రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.


యువగళం నవశకం బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500, తల్లికి వందనం కింద రూ.15,000 ఇవ్వనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. పేదవారికి ఖర్చులు తగ్గించేందుకు తాము ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. రైతుకు ఏడాదికి రూ.20000 సాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 



రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే అధికారం ఎవరికీ లేదు.. 
‘రాజకీయాల్లో పార్టీలు పెట్టే స్వేచ్ఛ అందరికీ ఉంది కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే అధికారం ఎవరికీ లేదు. హైదరాబాద్ ని నేను అభివృద్ధి చేశాను, నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు జగన్‌లా విధ్వంసం చేసి ఉంటే ఈ రోజు హైదరాబాద్ అంత సంపద ఉండేది కాదు. ఇప్పుడు కానీ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా కాపాడుకోకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేమని భేషరతుగా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్‌ని అభనందిస్తున్నాను. అమరావతి రాజధానిగా ఉంటుంది విశాఖ ఆర్థిక రాజధాని, ఐటి హబ్‌గా ఉంటుందని నేను చెప్పాను. అమరావతిని సర్వనాశనం చేసి మూడు ముక్కల ఆటాడాడు. రుషికొండకు బోడు గుండు కొట్టి విలాసం కోసం రూ.500 కోట్లు ఖర్చు పెట్టే హక్కు ఈ  ముఖ్యమంత్రికీ ఎవరిచ్చారు? ఇవన్నీ తలుచుకుంటుంటే ఆవేదనతో గుండెలు పిండేసినట్లుంటుంది’ అన్నారు చంద్రబాబు.


అబద్దాల పునాదులుమీద వైసీపీ ఏర్పాటు..
‘ఇసుక, లిక్కర్ స్కాంలు చేస్తూ స్వార్దం కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. విద్య, వైద్యం, రోడ్లు, వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించాడు. అబద్దాల పునాదులుమీద వైసీపీ నిర్మితమైంది, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ తెస్తామన్నారు తెచ్చారా?. మద్యపాన నిషేదం అన్నారు చేశారా? మద్య నిసేదం చేయకపోగా మద్యంపై వచ్చే  ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. సీపీఎస్ రద్దు అన్నారు,  చేశారా? సొంత బాబాయిని చంపారు, నాడు సీబీఐ విచారణ కావాలన్నారు, అధికారంలోకి వచ్చాకా సీబీఐ విచారణ వద్దన్నారు. మ్యానిఫెస్టోలో ఏమేమి చేయబోతామో త్వరలోనే ఉమ్మడి మ్యానిఫెస్టోను తయారు చేస్తామని’ చంద్రబాబు పేర్కొన్నారు.


‘బీసీలకు రక్షణ చట్టం తెస్తాం,  బీసీలను అన్ని విధాల ఆదుకుంటాం, ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందిస్తాం. ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు ఆర్దికంగా ఆదుకుంటాం. జగన్ పని అయిపోయింది, రేపు జరిగే కురుక్షేత్ర యుద్దంలో వైసీపీ ఓటమి ఖాయం. టీడీపీ జనసేన పొత్తు ప్రకటనతోనే వైసీపీ పని అయిపోయింది, వైసీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదు. ఎమ్మెల్యేలను ట్రాన్స్ పర్ చేస్తున్నారు, ఇక్కడ అవినీతి చేశాడని మరో నియోజకవర్గానికి పంపిస్తారా?. జగన్ క్యారెక్టర్ ఇప్పటికీ అర్దం కావటం లేదు, ఎంతో మంది రాజకీయ నాయకులను చూశా, కానీ ఇంత విచిత్రమైన వ్యక్తిని చూడలేదు’ అన్నారు.


మరో 100 రోజుల్లో ఎన్నికలు..
‘రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు, టీడీపీ జనసేన ఓట్లు తొలగిస్తున్నారు, మన ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యసవర ధరలు పెరిగిపోయాయి,  5 ఏళ్లలో మీ జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగాయా?ఆదాయం పెరిగిందా, ఖర్చులు పెరిగాయో ఆలోచించండి. 100 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికల తర్వాత మీ భవిష్యత్ ని ఉజ్వలంగా మార్చే భాద్యత టీడీపీ జనసేన తీసుకుంటుంది. అంగన్ వాడీలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవటం లేదు. ఉద్యోగస్తులకు పీఆర్సీ ఇచ్చాం,  మళ్లీ ఉద్యోగస్తులకు న్యాయం చేస్తామని’ చంద్రబాబు భరోసా ఇచ్చారు.


పోత్తు సూపర్ హిట్, జగన్ సినిమా అయిపోయింది..
వైసీపీ మునిగిపోయేపడవ అది మునిగిపోవటం ఖాయం. పోత్తు సూపర్ హిట్, జగన్ సినిమా అయిపోయింది.  టీడీపీ జనసేన అదిష్టానాలు ఏ నిర్ణయం తీసుకున్నా..కార్యకర్తలు వాటిని పాటించండి. 100 రోజులు కష్టపడండి, కష్టపడ్డ వారందరికీ గుర్తింపు ఇచ్చే బాధ్యత మాది. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది చేసి మీ రుణం తీర్చుకుంటాం’ అన్నారు చంద్రబాబు.


Also Read: వచ్చేది టీడీపీ, జనసేన ప్రభుత్వం- జగన్ కు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం: చంద్రబాబు