ABP  WhatsApp

Nandamuri Balakrishna: సమయం లేదు మిత్రమా! ఇది వైసీపీ అంతిమయాత్రకు ఆరంభ సభ - బాలకృష్ణ

ABP Desam Updated at: 20 Dec 2023 07:23 PM (IST)

Balakrishna Speech: నవశకం బహిరంగసభలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రసంగించారు. సమయం లేదు మిత్రమా.. వచ్చే ఎన్నికల్లో విజయమా? వీరస్వర్గమా? అనేది రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలని అన్నారు.

సభలో మాట్లాడుతున్న బాలక్రిష్ణ

NEXT PREV

Nandamuri Balakrishna Speech in Yuvagalam Navasakam: పాదయాత్ర అన్ని వర్గాల ప్రజలమధ్య విజయవంతంగా కొనసాగిందని.. ఇది యువగళం పాదయాత్ర ముగింపు సభ కాదని, వైసీపీ అంతిమ యాత్రకు ఆరంభ సభ అని బాలకృష్ణ అన్నారు. నవశకం బహిరంగసభలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రసంగించారు. రాష్ట్ర యువతకు వైసీపీలో తమకు జరిగిన అన్యాయం, ఇబ్బందులను గుర్తు పెట్టుకోవాలని అన్నారు. 1982లో ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపునకు కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా విశేష స్పందన వచ్చిందని అన్నారు. అదేవిధంగా నేడు యువగళం పాదయాత్రకు అంతటి విశేష స్పందన వచ్చిందని అన్నారు. 


యువనేతపై ఈగ వాలకుండా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కాపాడుకుంటూ వచ్చారు. యువనేతకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని సినిమాకే కాకుండా ప్రజాసమస్యలపై పోరాటానికి అధికంగా కేటాయిస్తున్నారు. రాష్ట్రంలోని అనేక సమస్యలపై పవన్ తిరుగులేని పోరాటం చేశారు. చంద్రబాబు తన విజన్ తో ఐటీ, డ్వాక్రాను తీసుకొచ్చారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చంద్రబాబు కొనసాగించి పేదలకు అండగా నిలిచారు. ప్రపంచ దేశాలకు చంద్రబాబు తన విజన్ ను పరిచయం చేశాడు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు, విధ్వంసాలు, కూల్చివేతలను పరిచయం చేశాడు.


కనకపు సింహాసనంపై శునకం మాదిరిగా జగన్ ప్రవర్తన


జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిని నిర్వీర్యం చేసి రూ.10లక్షల కోట్ల అప్పు చేశాడు. అరాచక పాలనలో ధరలు, పన్నులు, రేట్లు ఆకాశాన్నంటాయి. సామాన్యుడి జీవనం ప్రశ్నార్థకమైంది. జగన్ ల్యాండ్, సాండ్, మైన్ స్కాములతో దోచుకుంటున్నాడు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నాడు. ఏపీకి రాజధాని కోసం భూములిచ్చిన రైతులను వేధించాడు. అక్రమ కేసులతో బెదిరిస్తున్నాడు. పోలీసులు, ఉద్యోగులు, కార్మికులను జగన్మోహన్ రెడ్డి వేధిస్తున్నాడు. హిందూపురంలో ప్రభుత్వాసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో పెడితే జగన్ నిర్లక్ష్యంతో నేడు దానిలో పందులు, కుక్కలు తిరిగేలా పాడుబెట్టాడు. జగన్ పాలనలో ఒక్క గుంత పూడ్చలేదు. ఒక్క రోడ్డు వేయలేదు. సీఎం కుర్చీలో జగన్ కనకపు సింహాసనంపై శునకం మాదిరి ప్రవర్తిస్తున్నాడు.


సమయం లేదు మిత్రమా



జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానంటే అక్కడి ప్రజలు రాష్ట్ర సరిహద్దు వద్దే అడ్డుకుంటారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ప్రపంచ పటంలో ఏపీ ఉండదు. ఇది తథ్యం. సమయం లేదు మిత్రమా.. వచ్చే ఎన్నికల్లో విజయమా? వీరస్వర్గమా? అనేది రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలి. సొంత సామాజికవర్గాన్ని స్థానాల నుండి మార్చకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలను మాత్రమే ఓడిపోయే స్థానాల్లోకి పంపుతున్నాడు...ఇంక సామాజిక న్యాయం ఎక్కడా? జగన్మోహన్ రెడ్డి చూపించేది కపట ప్రేమ..సవతి తల్లి ప్రేమ...దయచేసి ఎవరూ నమ్మొద్దు. కప్ప బావి మాత్రమే తన ప్రపంచం అని భావించినట్లు...జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ మాత్రమే లోకం అనుకుంటున్నాడు.-


అణిచివేతలపై ఫ్రెంచి విప్లవం వచ్చిన విధంగా రాష్ట్ర ప్రజలు తమ హక్కుల కోసం పోరాడాలి. రానున్న ఎన్నికల్లో సుపరిపాలనకు స్వాగతం పలకాలి...ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. రాష్ట్రానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రజలంతా నడుం బిగించాలి. ఎవడు అడ్డొస్తాడో మేం చూస్తాం. మీరు ముందడుగు వేయండి’’ అని బాలక్రిష్ణ మాట్లాడారు.

Published at: 20 Dec 2023 07:21 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.