AP CM Jagan Vizag Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. సాగర నగరం విశాఖలో పలు కీలక కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుట్టనున్నారు.
విశాఖలో సీఎం రూట్ ఇదే...
విశాఖపట్నంలో ఆగస్టు 1న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పలు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు.
వైజాగ్ ఫేజ్ 1లో ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి కె. రహేజ కార్ప్ గ్రూప్ రూ. 600 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఆరు లక్షల చదరపు అడుగులలో మాల్ నిర్మాణం చేయనున్నారు. 4 లక్షల చదరపు అడుగుల పార్కింగ్ ప్రాంతంతో పాటుగా, 2026 లో పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు. 250 జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ స్టోర్స్, మల్టిప్లెక్స్‌లు, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్, ఫుడ్ కోర్టు, టెర్రస్ గార్డెన్, షాపింగ్ స్పేస్, ప్రత్యక్షంగా, పరోక్షంగా 8000 మందికి ఉపాధి కల్పించనున్నారు.
- ఫేజ్ 2లో దాదాపు 3000 మంది ఉద్యోగులకు సరిపడేలా 2.5 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్, 2027 నాటికి సిద్దమయ్యేలా ప్రణాళిక రచించారు.
- ఫేజ్ 3లో 200 గదులతో 4/5 స్టార్ హోటల్, 2029 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా లక్ష్యం ప్లాన్ చేశారు. అన్నీ కూడా గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతాయని తెలిపారు.
ఆంధ్ర యూనివర్శిటీ కేంద్రంగా ప్రారంభోత్సవాలు....
ఆంధ్ర యూనివర్శిటీ లో సీఎం వైఎస్ జగన్ పలు ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. ఏ హబ్ (ఆంధ్ర యూనివర్శిటీ స్టార్టప్ అండ్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ హబ్) ను రూ. 21 కోట్ల వ్యయంతో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. 2025 నాటికి 2 లక్షల చదరపు అడుగులతో దేశంలోనే అతి పెద్ద మల్టి డిసిప్లేనరీ ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌లో ఒకటిగా ఉండాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. ఇందులో భాగంగా మల్టీ సెక్టార్ బేస్‌డ్ ఇంక్యుబేషన్ సెంటర్స్, అనెక్స్ సెంటర్స్, ప్రొటొటైపింగ్–మేకర్స్ ల్యాబ్, స్టూడెంట్ ఐడియేషన్ సెంటర్స్ ఏర్పాటు కానున్నాయి. ఎలిమెంట్ ( ఆంధ్ర యూనివర్శిటీ ఫార్మా ఇంక్యుబేషన్ మరియు బయోలాజికల్ మానిటరింగ్ హబ్) ఫార్మా, బయోటెక్, జెనోమిక్స్ ఇంక్యుబేషన్, టెస్టింగ్ ల్యాబ్ కోసం రూ. 44 కోట్ల వ్యయంతో 55,000 అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. డ్రగ్, ఫార్మా రీసెర్చ్‌లో ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి నిర్మించారు. గ్లోబల్ కమ్యూనిటీ కోసం చౌకైన మందులను ఉత్పత్తి చేసేందుకు అవసరమయ్యేలా రీసెర్చ్ ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు.
ఆల్గారిథమ్ (ఆంధ్ర యూనివర్శిటీ డిజిటల్ జోన్ మరియు స్మార్ట్ క్లాస్ రూమ్స్ కాంప్లెక్స్) రూ. 35 కోట్ల వ్యయంతో 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో 250 సీటింగ్ కెపాసిటీ ఉన్న రెండు ఆధునిక సెమినార్ హాల్స్ , 15 స్మార్ట్ క్లాస్ రూమ్స్, 500 కంప్యూటర్ సిస్టమ్స్‌తో శిక్షణ ఇవ్వనున్నారు. ఆన్‌లైన్ టెస్టింగ్ ప్రయోజనాల కోసం నిర్మించిన భవనం,లో కంప్యూటర్ ఇంజినీరింగ్ అవసరాలు తీర్చడం, ఆటోమేషన్, రోబోటిక్స్, డ్రోన్ అసెంబ్లీ, స్మార్ట్ క్లాస్‌రూమ్స్ దీని ప్రత్యేకతలగా చెబుతున్నారు. ఏయూ– ఎస్‌ఐబీ (ఆంధ్ర యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్) ఇది ఐఐఎం విశాఖపట్నంతో ఎంవోయూ కింద రూ. 18 కోట్ల వ్యయంతో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ అనలటిక్స్‌లో ప్రత్యేక బ్యాచిలర్, మాస్టర్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. 50 శాతం అంతర్జాతీయ విద్యార్ధులకు ఇందులో ప్రవేశం కల్పిస్తారు.
ఏయూ– అవంతి (ఆంధ్ర యూనివర్శిటీ అవంతి ఆక్వాకల్చర్ స్కిల్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హబ్) ఇది అవంతి ఫౌండేషన్ ఎంవోయూతో రూ. 11 కోట్ల వ్యయంతో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన భవనం. మెరైన్ ఫార్మింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌లలో నైపుణ్య శిక్షణ, ఆక్వాకల్చర్, రొయ్యల పెంపకంలో వనరులను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లుగా ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.