AP CM YS Jagan to tour Vizianagaram, Visakhapatnam on May 3:
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. మే 3వ తేదీన సీఎం జగన్ విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్ధాపన, చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్‌ ప్రాజెక్ట్‌ మిగులు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. విశాఖపట్నం– మధురవాడలో వైజాగ్‌ ఐటీ టెక్‌ పార్క్‌కు శంకుస్ధాపన చేయనున్నారు.


విజయనగరం జిల్లాలో సీఎం జగన్ షెడ్యూల్‌
ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు భోగాపురం మండలం ఎ.రావివలస గ్రామం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 10.25 గంటలకు జీఎంఆర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌కు చేరుకుంటారు, ఆ సెంటర్‌ను సందర్శిస్తారు. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి శంకుస్ధాపన చేస్తారు. 10.30 గంటలకు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం, చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్‌ ప్రాజెక్ట్‌ మిగులు పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. 10.55 గంటలకు సవరవిల్లి వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభ వేదిక వద్దకు చేరుకుంటారు. సభ అనంతరం 1.20 గంటలకు అక్కడి నుంచి విశాఖ పర్యటనకు సీఎం జగన్ బయలుదేరుతారు. 


విశాఖపట్నంలో సీఎం జగన్ పర్యటన
మే 3న మధ్యాహ్నం 1.40 గంటలకు విశాఖ మధురవాడ ఐటీ హిల్స్‌ నెంబర్‌ 3 వద్ద గల హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో బయలుదేరి ఐటీ హిల్స్‌ నెంబర్‌ 4లో గల వేదిక వద్దకు 2 గంటలకు చేరుకుంటారు. 2.30 – 3.00 సమయంలో వైజాగ్‌ ఐటీ టెక్‌ పార్క్‌ శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ సందర్శిస్తారు, అనంతరం పారిశ్రామికవేత్తలతో నిర్వహించే కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తారు. తర్వాత 3.50 గంటలకు అక్కడినుంచి బయలుదేరి రుషికొండలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి చేరుకుంటారు. అక్కడ ఇటీవల వివాహం చేసుకున్న ఎంపీ కుమారుడు దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు మధురవాడ హెలిప్యాడ్‌ నుంచి బయలుదేరి, 5.20 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 6.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


సుమారు 3,500 కోట్ల రూపాయలతో విశాఖ ఐటీ సెజ్ లోని హిల్ నెంబర్ 4 మీద నిర్మించనున్న వైజాగ్ టెక్ పార్క్ ( అదానీ డేటా సెంటర్) కు సీఎం జగన్ వచ్చే నెల మూడో తేదీన శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి హిల్ నెంబర్ 3 మీద నిర్మిస్తున్న హెలిప్యాడ్ ను, హిల్ నెంబర్ 4 మీద నిర్మించనున్న డేటా సెంటర్ కు సంబంధించిన ఏర్పాట్లను వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర పరిశీల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కలెక్టర్ మల్లికార్జున, నగర్ పోలీస్ కమిషనర్ తదితరులు శనివారం పరిశీలించారు. 


తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని చెప్పిందని, అన్నమాట ప్రకారమే వచ్చే నెల మూడో తేదీన ముఖ్యమంత్రి జగన్ ఏర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడమే కాకుండా, వెంటనే పనులు మొదలుపెట్టనున్నారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అలాగే విశాఖ నగరానికి పేరు తెచ్చే విధంగా వైజాగ్ టెక్ పార్క్( అదానీ డేటా సెంటర్) నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని ఆయన చెప్పారు. 134 ఎకరాలలో నిర్మిస్తున్న ఈ టెక్ పార్కు మూడు దశలలో ఏడేళ్లలో పూర్తి చేస్తామని సుబ్బారెడ్డి వివరించారు. ఈ టిక్ పార్క్ ద్వారా సుమారు 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించునున్నాయని చెప్పారు.