Kidney Racket Case Vizag: విశాఖలో కిడ్నీ రాకెట్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అక్రమంగా డబ్బులు సంపాధించుకుంటున్న ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు, అమాయక ప్రజలే లక్ష్యంగా నిందితులు కిడ్నీ రాకెట్ కొనసాగిస్తున్నారు. ఈకేసులో ఆపరేషన్ చేసిన వైద్యులపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇంకా అరెస్టులు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే శ్రీ తిరుమల ఆసుపత్రి ఎండీ పరమేశ్వర రావును అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న డాక్టర్ స్రవంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే కామరాజు అనే వ్యక్తి పోలీసులకు లొంగిపోగా.. శ్రీను పరారీలో ఉన్నారు. బాధితుడు వినయ్ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. 


అసలేం జరిగిందంటే..?


కిడ్నీకి 8.50 లక్షలు ఇస్తామంటూ కామరాజు అనే వ్యక్తి, శ్రీను అనే మరొకరు వినయ్ కుమార్ కు డబ్బు ఆశ చూపారు. డీల్ కుదుర్చుకున్న ప్రకారంగానే కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించాడు బాధితుడు వినయ్ కుమార్. కలెక్టర్ ఆఫీస్ సమీపంలో విజయ మెడికల్ లేబ్ లో వినయ్ కు వైద్య పరీక్షలు చేయించాడు కామరాజు. అయితే ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్న తరువాత వినయ్ కు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తనకు అన్యాయం జరిగిందని, తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు ఏప్రిల్ 27వ తేదీన పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


పోలీసులకు ఫిర్యాదు చేయగానే నిందితులు పరార్


ఈ క్రమంలోనే హాస్పిటల్ డాక్టర్, మధ్యవర్తులు కామరాజు, శ్రీనులు పరారయ్యారు. అయితే తిరుమల హాస్పిటల్ కు లైసెన్స్ ఉండా, డాక్టర్లు నిజం డాక్టర్లా నకిలీనా అనే తేల్చే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగులకు, అమాయకులకు డబ్బు ఆశ చూపి, కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పిస్తున్నారు. కిడ్నీ మార్పిడి జరిగాక మాట్లాడుకున్న దాని కంటే తక్కువ డబ్బులు ఇస్తున్నారని పోలీసులు గుర్తించారు. మరిన్ని విషయాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి. 






నాలుగేళ్ల కిందట ఇదే సీన్..





సరిగ్గా నాలుగేళ్ల కిందట అంటే 2019లోనూ విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. హైదరాబాద్‌కు చెందిన పార్థసారధి అనే వ్యక్తి నుంచి కిడ్నీ తీసుకుని చివరికి అతడ్ని మోసం చేసింది ఓ గ్యాంగ్. కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకుంటే మొదట రూ.12లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ పూర్తయ్యాక, పార్థసారధికి కేవలం రూ.5లక్షలు ఇవ్వడంతో మోసపోయానని గ్రహించాడు. బాధితుడు పార్థసారధి మహరాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు బహిర్గతమైంది. మొదట తన ఇష్టం మేరకే కిడ్నీ ఇచ్చినా, డీల్ కుదుర్చుకున్నంత మొత్తం తనకు ఇవ్వకపోవడంతో నష్టపోయాను, మోసపోయాను అంటూ బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారని అప్పట్లో బాధితుడు పార్థసారధి ఆరోపించారు. ఆ కేసులో కొందరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ అదే సమయంలో అరెస్ట్ చేశారు.