AP CID issued Notice To Gouthu Sirisha: తెలుగుదేశ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషకు ఏపీ సీఐడీ నోటీసులు జారీచేసింది. ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న అమ్మఒడి, వాహనమిత్ర పధకాలు రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై గౌతు శిరీషకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని ఆమె తండ్రి, మాజీ మంత్రి గౌతు శివాజీ నివాసానికి శనివారం రాత్రి వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. జూన్ 6న మంగళగిరి లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. సీఆర్పీసిలోని సెక్షన్ 41 క్రింద టీడీపీ మహిళా నాయకురాలు గౌతు శిరీషకు నోటీసు జారీ చేసినట్టు సమాచారం.


ప్రతిపక్ష టీడీపీ నేతలు ఏపీ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ విధానాలపై సోషల్ మీడియాలో పోస్టులు చేసి వివాదాలలో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలో ఇదివరకే మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సహా పలువురు రాష్ట్ర మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లాంటి నేతలు జైలుపాలయ్యారు. కొన్ని రోజుల తరువాత బెయిల్ మీద విడుదలయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ, సీఐడీ అంత తేలికగా తీసుకోవడం లేదు.


ప్రభుత్వ పథకాలు రద్దు అని పోస్టులపై రగడ
వాహనమిత్ర, అమ్మఒడి పథకాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు రావడంతో మే 30న ఏపీ సీఐడీ దీనిపై కేసు నమోదు చేసింది. కేసు విచారణలో భాగంగా ఇప్పటికే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu)ముఖ్య అనుచరుడిని సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఆర్థిక సమస్యల కారణంగా ఏపీ ప్రభుత్వం పథకాలను నిలిపివేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ పోస్టులను షేర్ చేసిన టెక్కలి టీడీపీ నేత వెంకటేష్‌ను గురువారం నాడు ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకోగా, శనివారం రాత్రి మహిళా నాయకురాలు గౌతు శిరీషకు నోటీసులు ఇచ్చారు. జూన్ 6న విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. 


Also Read: Fact Check : అమ్మఒడి, వాహన మిత్ర పథకాలు రద్దు - నిజంగా ఆ ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చిందా ?


స్పందించిన ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్.. అబద్ధం అని క్లారిటీ






ఈ ఫేక్ న్యూస్ ... ప్రెస్ నోట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న ఫ్యాక్ట్ చెక్ ( AP Fact Check ) విభానికి కూడా తెలిసింది. వెంటనే వారు ఫ్యాక్ట్ చెక్ చేసి అసలు వాస్తవాన్ని తెలియచేశారు. అలాంటి పోస్టులన్నీ ఫేక్ అని.. వాటిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అందులో భాగంగా ఏపీ సీఐడీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేసింది.