గడిచిన ఐదేళ్లలో ఎంపీ, ఎమ్మెల్యేలపై సీబీఐ కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఏపీనే టాప్‌లో నిలిచింది. 2017-22 మధ్యకాలంలో ఏపీకి చెందిన 10 మంది చట్టసభల సభ్యులపై సీబీఐ కేసులు నమోదైయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మాలారాయ్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి జింతేంద్ర సింగ్ పార్లమెంట్ సాక్షిగా బదులిచ్చారు. గత ఐదేళ్లలో ఎంపీ, ఎమ్మెల్యేలపై సీబీఐ కేసుల వివరాలను ఆయన అందించారు. దేశవ్యాప్తంగా కలిపి 56 నమోదయ్యాయని వాటిలో అత్యధికంగా 10 కేసులతో ఏపీ అగ్రస్థానంలో ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రాల వారీగా ఏపీ నుంచి 10మంది ఉంటే... కేరళ-6, యూపీ-6, వెస్ట్ బెంగాల్ 5, అరుణాచల్ ప్రదేశ్ - 5, తమిళనాడు - 4, ఢిల్లీ-3, బిహార్- 3, మణిపూర్-3, కర్ణాటక-2, జమ్మూ, కాశ్మీర్ -02, హరియాణా -01, మధ్యప్రదేశ్ -01, మహారాష్ట్ర -01, లక్షద్వీప్ -01, ఛత్తీస్‌గఢ్-01, మేఘాలయ-01, ఉత్తరాఖండ్ -01 కలిపి మొత్తం 56 మందిపై సీబీఐ కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది .
బీజేపీయేతర పార్టీలు అధికారంలో లేని రాష్ట్రాల్లోనే కేసులు అధికం
యూపీ మినహా అత్యధికంగా ఎంపీ, ఎమ్మెల్యేలపై సీబీఐ కేసులు నమోదైన రాష్ట్రాల్లో అత్యధికం బీజేపీ పాలనలో లేని రాష్ట్రాలే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ , కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల చట్టసభ్యుల పైనే కేసులు అధికంగా నమోదు అయ్యాయి. ఇక పార్టీల పరంగా చూసుకుంటే వైసీపీ, టీడీపీ, ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, ఆర్జేడీ, ఏఐఏడీఎంకే, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ నేతలపై కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది. అయితే వీళ్ళలో ఏ పార్టీ చట్టసభ్యులు ఎంత మంది ఉన్నారనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
సీబీఐ కేసుల్లో నేరాలు రుజువైన శాతం ఇలా :
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని నేతలపై నమోదైన సీబీఐ కేసుల్లో నేరం రుజువైన శాతం 2017 లో 66.90 శాతం ఉంటే..., 2018 లో 68శాతం, 2019లో 69. 19శాతం, 2020లో 69. 83శాతం కాగా 2021లో 67. 56 శాతం అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు .
ఆ పదిమంది ఎవరనేదానిపై చర్చ :
ఇక కేంద్రం గత ఐదేళ్లలో సీబీఐ కేసుల్లో ఇరుక్కున్న చట్టసభల సభ్యుల్లో ఏపీ నుంచి ఏకంగా 10 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరనే దానిపై పాత లెక్కలు తిరగేస్తున్నారు ఎనలిస్టులు.