Minister Amarnath Comments On Nadendla Manohar: రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు మంత్రి గుడివాడ  అమర్నాథ్ (Minister Gudivada Amarnath)‌. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. జనసేన నేత నాదెండ్ల  మనోహర్‌(Nadendla Manohar)ను కట్టప్పతో పోల్చారు మంత్రి అమర్నాథ్‌. కట్టప్ప మనోహర్‌ (Kattappa Manohar) అంటూ కామెంట్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం ఒక సంస్థకు  ఊరికే భూములు ఇచ్చేస్తోందని చెప్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. నాదెండ్ల మనోహర్‌ కట్టప్ప వేశాలకు పవన్‌ కళ్యాణ్‌ పడతారేమో గానీ... రాష్ట్ర ప్రజలు  పడరని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ చదవి ప్రభుత్వంపై బుదరచల్లితే.. ప్రజలు నమ్మేస్తారని అనుకోవడం ఆయన అమాయకత్వమని అన్నారు.


నాదెండ్ల మనోహర్‌ వారసత్వంలో వెన్నుపోట్లు పొడవడం తప్ప ఇంకేమీ లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌. తండ్రి నాదెండ్ల భాస్కర్‌రావు (Nadendla Bhaskara Rao) పెద్ద కట్టప్ప అయితే... తనయుడు నాదెండ్ల మనోహర్‌ చిన్న కట్టప్ప అంటూ విమర్శించారు. పెద్ద కట్టప్ప ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిస్తే... చిన్న కట్టప్ప పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan)ను వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ అలైనమెంట్‌ పాలసీలో ఏదో జరిగిపోయిందంటూ... అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. స్కూల్ బ్యాగులు, పరిశ్రమలు గురించి తప్పుగా మాట్లాడి ప్రజలని తప్పుదోవ పట్టించవద్దన్నారు.


టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా విమర్శలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు 70 శాతం పోలవరం కట్టలేదు...70 శాతం నిధులు కొట్టేశారని ఆరోపించారు.  ఇక.. కేంద్రం ఇచ్చే నిధులపై కూడా స్పష్టత ఇచ్చారు. ఏపీ నుండి వెళ్లిన ట్యాక్సులనే కేంద్రం ఇస్తోంది తప్ప.... అక్కడి నిధులు మాత్రం ఇవ్వడంలేదన్నారు. సీఎం జగన్‌   ప్లీనరీలో చెప్పినప్పటికీ కేంద్రం ఆలోచన చేయలేదన్నారు. తెలంగాణ ఎన్నికలతో తమకు సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని చూసి  ఓర్వలేక కొంతమంది ప్రతిపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. 


2022-23 సంవత్సరానికి గాను జీఎస్‌డీపీ (GSDP) గ్రోత్ రేటు 11.43 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉందని చెప్పారు. అలాగే దేశ వృద్ధి రేటు 8శాతంగా  ఉందన్నారు. ఇది తాము చెప్తున్న లెక్కలు కాదని... రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన రికార్డు అని స్పష్టం చేశారు. తలసరి ఆదాయంలో ఏపీ 2019 నాటికి 17వ స్థానంలో ఉంటే...  ఇప్పుడు 9వ స్థానంలో ఉందన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పరంగా యువతకి వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. భారీ పరిశ్రమలు సెక్టార్‌లో గానీ, చిన్న  తరహా పరిశ్రమల్లో గానీ 13 లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు. ఇక... వ్యవసాయంలో 2019లో 27వ స్థానంలో ఉంటే... ఇప్పుడు 6వ స్థానంలో ఉన్నామని చెప్పారు.  పరిశ్రమల వృద్ధి 2019లో 22వ స్థానంలో ఉంటే... ఇప్పుడు 3వ స్థానంలో ఉన్నామన్నారు. గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కే అత్యదిక పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు  మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌. బిజినెస్ రిసోర్స్ యాక్షన్ ప్లాన్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 350 అంశాలు పరిగణనలోకి తీసుకుని ఇచ్చిన ర్యాంకులో నెంబర్ వన్ స్థానంలో  ఉన్నామని చెప్పేందుకు గర్వపడుతున్నానని అన్నారు. 


చిన్న తరహా పరిశ్రమల విషయంలో గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఉన్నామని... ఏపీని పారిశ్రామిక హబ్‌గా తయారు చేశామన్నారు. ఏసీ సంస్థలన్నీ ఏపీలో పెట్టుబడులు  పెడుతున్నాయని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్‌లో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిలు వచ్చాయని చెప్పారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌. పోర్టుల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా  తీసుకుని చేస్తున్నామన్నారు. ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ప్రతి 50 కిలోమీటర్లకి ఒక యాక్టవిటీ వుండాలనే ఆలోచనతో నిర్మాణాలు  చేపడుతున్నామన్నారు. గత కేబినెట్‌ సమావేంలో 20 వేల కోట్ల పెట్టుబడులకు సీఎం జగన్ క్లియరెన్స్ ఇచ్చారన్నారు. ఉన్న ఆరు పోర్టులకు అదనంగా మరో నాలుగు  పోర్టులు నిర్మిస్తున్నామన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నామని చెప్పారు. పోర్ట్ ఆధారిత పరిశ్రమలు తీసుకువస్తున్నామన్నారు. మూడు  ఇండస్ట్రియల్ కారిడార్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయని చెప్పారు.