AP Minister Gudivada Amarnath:
'అల్లూరి' వరదలు పట్ల అప్రమత్తంగా ఉన్నాం!
- 15 రోజులు కిందటే అధికారులతో చర్చించాం
- అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం
- అల్లూరి జిల్లా ఇంఛార్జ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి
విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో తీర ప్రాంతాల జిల్లాల అధికారులు, ప్రజా ప్రతినిధులు అలర్ట్ అయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉధృతంగా కురుస్తున్న వర్షాలకు వరదలు వచ్చే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇంఛార్జి మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. 
మంత్రి గుడివాడ అమర్నాథ్ బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది జూలై 9వ తేదీన శబరి నది ఉప్పొంగి చింతూరు ప్రాంతం అంతా జలమయమైందన్నారు. శబరి ఉప్పొంగడంతో అనేక గ్రామాలు నీట మునిగాయని, వెంటనే ప్రభుత్వం స్పందించి అక్కడ ప్రజలకు పునరావాసం కల్పించిందని గుర్తుచేశారు. గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తాను అల్లూరి జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించానని అమర్నాథ్ చెప్పారు. అల్లూరి జిల్లాకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా రంగం సిద్ధం చేశామనిమంత్రి పేర్కొన్నారు. 
వరద ఉధృతి పెరిగినా, అల్లూరు జిల్లా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడకుండాఅన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. వైద్య సిబ్బందిని, రెవిన్యూ సిబ్బంది అప్రమత్తం చేశామని ఆయన తెలియజేశారు. గత ఏడాది వరద ఉగ్రరూపం దాల్చినా, ఏ ఒక్కరు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, ఆ తర్వాత వరదల్లో నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం కూడా అందించింది అన్న విషయాన్నిమంత్రి అమర్నాథ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలు అధికారులు, వాతావరణ శాఖ సూచనలు పాటిస్తే ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని సూచించారు.


తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు 
రాష్ట్రంలో రాగల 4 రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి వచ్చే సోమవారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షం ఉందని వివరించింది. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వీటితోపాటు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాభాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.  
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial