Actor Prithvi On Gorantla Madhav Video: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ క్లిప్ అంటూ వైరల్ అవుతున్న వీడియోపై నటుడు, వైఎస్ఆర్ సీపీ మాజీ నేత పృథ్వీ స్పందించారు. ఆ వీడియో వైరల్ అవుతున్నందున రాష్ట్ర ప్రజలు, అక్కాచెల్లెళ్లు, తల్లులు సెల్‌ ఫోన్‌ చూడొద్దని తాను మొట్టమొదటిసారి విజ్ఞప్తి చేయాల్సి వచ్చిందని పృథ్వీ అన్నారు. మొన్న వరలక్ష్మీ వ్రతం జరిగిన ముందురోజే తాను ఆ దరిద్రాన్ని తాను చూశానంటూ ఎద్దేవా చేశారు. అందుకే మిగిలిన వారిని అది చూడొద్దని చెప్పానని అన్నారు. దేశ చరిత్రలో ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ లేదంటూ పృథ్వీ వ్యాఖ్యానించారు. సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రలో నటించిన వాంటెడ్ పండుగాడు అనే చిత్ర టీమ్ గురువారం (ఆగస్టు 12) విశాఖపట్నం వచ్చింది. ఇక్కడ వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా గురించి పృథ్వీ మాట్లాడారు.


ఆ తర్వాత ఎంపీ గోరంట్ల మాధవ్ వైరల్ వీడియో పైన స్పందించాలని విలేకరులు కోరగా, పృథ్వీ ఈ మేరకు స్పందించారు. పార్లమెంటు అంటే పవిత్ర దేవాలయం అని ఆయన అన్నారు. అలాంటి పార్లమెంటు సభ్యుడు నీచమైన పని చేయడం ఏంటని నిలదీశారు. భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన ఎంతో మంది సమరయోధులు పార్లమెంటులో కొలువయ్యారని, అలాంటి వాళ్లు ఉండాల్సిన చోట ఇలాంటి వాళ్లు ఉన్నారని విమర్శించారు. 


గతంలో వైఎస్ఆర్ సీపీలో ఉన్నప్పుడు పృథ్వీ ఎస్వీబీసీ ఛైర్మన్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లుగా ఓ ఆడియో టేప్ అప్పట్లో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయనకు ఆ పదవి పోయింది. పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలు సైతం తీసుకుంది. ఆ విషయంపై పృథ్వీ స్పందిస్తూ.. గతంలో వారం రోజులపాటు తన మీద ప్రెస్‌ మీట్లు పెట్టారని, ఇప్పుడు అలాంటివి ఏవని ప్రశ్నించారు. ఇప్పుడు గోరంట్లపైన ఒక్క ప్రెస్‌ మీట్‌ కూడా పెట్టలేదని అన్నారు. 


ఎస్పీ మాట్లాడడం ఆయనకి ఏలా తెలుసు?
అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రెస్ మీట్ గురించి మాట్లాడుతూ.. ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నట్లుగా ఢిల్లీలో ఉన్న గోరంట్ల మాధవ్ కు ఎలా తెలుసని ప్రశ్నించారు. సరిగ్గా ఎస్పీ ప్రెస్ మీట్ సమయంలోనే గోరంట్ల మాధవ్‌ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారని అన్నారు. సదరు వైరల్ వీడియో యూకే నుంచి అప్‌లోడ్‌ అయిందని, ఎవరో చేశారని, ఒరిజినల్ వీడియో దొరకలేదని ఎస్పీ చెబుతుండడం చాలా దీనంగా ఉన్నాయని కొట్టిపారేశారు. ఆయన పృథ్వీ అయి ఉంటే ఎస్పీ అలా మాట్లాడి ఉండేవారు కాదని, తమకు అంగబలం, అర్థబలం లేదని అన్నారు.


ఆ వీడియోతో ఫోరెన్సిక్‌ నిపుణులు అరగంటలో నిజానిజాలు తేలుస్తారని అన్నారు. పార్టీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటూనే వీడియో నకిలీ అని తేల్చేశారని విమర్శించారు. వాళ్ల కోర్టులో అది ఫేక్‌దేనని తేలుతుందని ఎద్దేవా చేశారు. అంతకు మించి వేరే ఏమీ అవ్వదని అన్నారు.