Visakha Garjana : మూడు రాజధానులకు మద్దతుగా శనివారం విశాఖలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన నిర్వహిస్తున్నారు. రేపటి విశాఖ గర్జన రూట్ మ్యాప్ విడదల చేసింది జేఏసీ. శనివారం ఉదయం 10 గంటలకు LIC బిల్డింగ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీగా జైల్ రోడ్, సిరిపురం, చిన వాల్తేర్ జంక్షన్ మీదుగా బీచ్ వద్ద ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకూ ప్రదర్శనగా వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద భారీ సభ నిర్వహించనున్నారు. ర్యాలీ జరిగే సమయంలో పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించనున్నారు.
విశాఖ గర్జనకు వైసీపీ మద్దతు
ఏపీలో రాజధానుల వ్యవహారంపై చర్చ స్పీడందుకుంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు అరసవల్లి వరకు మహా పాదయాత్ర చేపట్టారు. వికేంద్రీకరణ పేరిట అధికార వైసీపీ ర్యాలీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తుంది. మూడు రాజధానులకు మద్దతు రేపు(శనివారం) విశాఖ గర్జన నిర్వహిస్తుంది. విశాఖ గర్జన పేరుతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని జేఏసీ చేపట్టిన ర్యాలీకి వైసీపీ మద్దతు తెలిపింది. విశాఖ గర్జనలో పాల్గోవాలని మంత్రులు గుడివాడ అమరనాథ్, ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ వైసీపీ శ్రేణులకు ఇప్పటికే పిలుపునిచ్చారు.
విశాఖలో రాజధానికి జేఏసీ డిమాండ్
నాన్ పొలిటికల్ జేఏసీలో అంబేడ్కకర్ యూనివర్సిటీ మాజీ వీసీ హనుమంతు లజపతిరాయ్ కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. ప్రొఫెసర్లు, వైద్య నిపుణులు, లాయర్లు, జర్నలిస్టులు, ఎన్జీవో అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు సహా మొత్తం 26 మంది సభ్యులు ఈ జేఏసీలో ఉన్నారు. అక్టోబర్ 15న విశాఖపట్నంలో ‘విశాఖ గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేస్తామని జేఏసీ తొలి సమావేశంలోనే ప్రకటించింది. దీంతో రేపు భారీ ర్యాలీకి సన్నాహాలు ఏర్పాట్లు చేస్తుంది. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర వాసులు ర్యాలీలో పాల్గొని తమ మద్దతు తెలపాలని జేఏసీ ప్రతినిధులు కోరుతున్నారు. విశాఖలో వాయు, నౌకాశ్రయం, రైలు మార్గాలు ఉండడంతో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి పెద్ద నగరాలతో పోటీపడే సామర్థ్యాన్ని ఉందని, అందుకే ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తున్నారు.
బైక్ ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల కోసం ఉద్యమం క్రమంగా ఊపందుకుంటోంది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో విశాఖపట్నం వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖను రాజధాని చేయాలంటూ గంధవరం నుంచి చోడవరం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో మేధావులు, టీచర్లు సహా వైసీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం చోడవరంలోని కొత్తూరు జంక్షన్ లో మానవహారం చేపట్టారు. ఒక రాజధాని వద్దు మూడు రాజధానులే ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మూడు రాజధానుల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేందేందుకు ఆస్కారం ఉంటుందని వారు అన్నారు. పాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల రాష్ట్రానికి లాభమే తప్పా నష్టం లేదని తెలిపారు.