రోజులు మారాయి... నిజమేనండీ. ఒకప్పుడు స్కూల్ కి లీవ్ పెట్టాలంటే ఇంట్లో ముసలి వాళ్లను పైకి పంపేసేవాళ్లం. టీచర్ నిన్న ఎందుకు రాలేదంటే మా మామ చనిపోయిందనో, మా తాత కాలం చేశారని చిన్న అబద్దాలు చెప్పే వాళ్లం. కాలం మారిందండోయ్. ఇప్పుడు లీవ్ కావాలంటే ఇలాంటి చిన్న అబద్ధాలు మానేశారు. ఏకంగా ప్రిన్సిపల్ కే లెటర్ రాస్తున్నారు. కరోనా వచ్చి చదువులు చాలా మట్టుకు అటకెక్కాయి. ఎప్పుడు స్కూళ్లు, కాలేజీ ఉంటాయో, ఎప్పుడు మూసేస్తారో తెలియడం. ఈ సమయంలో చదువులు కూడా అలానే ఉంటున్నాయి. ఇటీవల తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఇది స్పష్టమైంది.  ఒకప్పుడు ప్రిన్సిపల్ కు లెటర్ రాయడమంటే పెద్ద ప్రస్థానం. స్కూల్ ఎస్పీఎల్(స్కూల్ పీపుల్స్ లీడర్), కాలేజీల్లో క్లాస్ లీడర్ అనుమతిలో లెటర్ రాయాల్సి ఉండేది. విషయం మరీ ముఖ్యమైతే తప్ప ప్రిన్సిపల్ వరకూ చేరేది కాదు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. సినిమా కోసం లీవ్ అడిగే వింత పరిస్థితులు వచ్చాయి. 


Also Read: సినిమా టికెట్ల విక్రయాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... ఐఆర్సీటీసీ తరహాలో ఏపీఎఫ్‌డీసీకు బాధ్యతలు అప్పగింత.


వైజాగ్ జాతిరత్నాలు


సెలవు కావాలంటే ఒకప్పుడు విద్యార్థులు భయపడిపోయేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఇటీవల విడుదలైన పుష్ప సినిమా కోసం సెలవు కావాలంటూ విశాఖలో ఇంటర్‌ విద్యార్థులు ప్రిన్సిపల్‌కు లేఖ రాశారు. ఈ నెల 17న పుష్ప సినిమా విడుదల అయ్యింది. దానికి ముందు రోజు వైజాగ్ లోని ఓ ప్రైవేట్‌ కళాశాల విద్యార్థులు ప్రిన్సిపల్ కు లేఖ రాశారు. సినిమా విడుదలయ్యే రోజు కాలేజీకి సెలవు ప్రకటించాలని కోరారు. సెలవు ఇవ్వకపోయినా కాలేజీకి లీవ్ పెట్టేస్తామని పేర్కొన్నారు. తాము లీవ్ పెట్టిన విషయాన్ని ఇంటికి మెసేజ్‌లు పంపొద్దని, కాల్స్‌ చేయొద్దని ప్రిన్సిపల్‌ను కోరారు. సెలవు  ఇవ్వాలని కోరిన లేఖలో చివర్లో తగ్గేదేలే అంటూ ప్రిన్సిపల్‌కు సూపర్ ఆఫర్ ఇచ్చారు. తమ వద్ద ఎక్స్ ట్రా టికెట్ ఉందని కావాలంటే సినిమాకు రావొచ్చని ప్రిన్సిపల్ కు ఆఫర్ ఇచ్చారు. అయితే ప్రిన్సిపల్ ఆ తర్వాత రోజు విద్యార్థులతో కలిసి సినిమాకు వెళ్లారా... లేదా అనేది వాళ్లకే తెలియాలి. ఇప్పుడు ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఈ విద్యార్థులు జాతిరత్నాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Also Read: మద్యంపై వ్యాట్ తగ్గింపు.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..! ఏ బ్రాండ్ ఎంత తగ్గనుందంటే ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి