Visakha Tension : విశాఖలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బస చేస్తున్న నోవాటెల్ హోటల్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నోవాటెల్‌ వద్దకు భారీ ఎత్తున జనసేన నేతలు కార్యకర్తలు, పవన్ అభిమానులు చేరుకున్నారు. దీంతో నోవాటెల్ హోటల్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. హోటల్‌ ఎదుట జనసైనికులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారని జనసేన పార్టీ ఆరోపిస్తుంది. శనివారం విశాఖపట్నం ఎయిర్ పోర్టులో మంత్రుల వాహనాలపై దాడి ఘటనపై జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.  






రాత్రికి విశాఖలోనే పవన్  


విశాఖలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉందని నగరంలో ర్యాలీలు, బహిరంగ సభలు, రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకూడదని పోలీసులు జనసేనాని పవన్ కల్యాణ్ కు నోటీసులు అందజేశారు. జనసేన జనవాణి కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. అయితే సంబంధంలేని కేసులో 28 మంది జనసేన నేతలు అరెస్టు చేశారని పవన్ ఆరోపించారు. అరెస్టైన జనసైనికులను విడుదల చేసే వరకు విశాఖను విడిచి వెళ్లనని పవన్ తెలిపారు. ఇవాళ రాత్రికి విశాఖలోనే పవన్ బస చేయనున్నారు. 






వైసీపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు 


విశాఖ నోవాటల్ లో బసచేసిన పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున హోటల్ ముందు బీచ్ రోడ్డు వద్ద నిరీక్షిస్తున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలకు, తన అభిమానులకు ఎటువంటి అల్లర్లకు పాల్పడద్దని పవన్ కోరారు. మరోవైపు హోటల్ వైపు ప్రజలు రాకుండా భారీగా పోలీసులను మోహరించారు. హోటల్ అద్దాల నుంచి పవన్ కళ్యాణ్ తన అభిమానులకు స్పందించడం తప్ప బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. హోటల్ ఉన్న పవన్ వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఆర్కే బీచ్ లో వాకింగ్ చేయాలని ఉంది అందుకు పోలీసులు పర్మిషన్ ఇస్తారా లేదో అంటూ ట్వీట్ చేశారు. 






పవన్ కు చంద్రబాబు ఫోన్ 


విశాఖలో ఉన్న పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఫోన్ చేశారు. ప్రభుత్వం పోలీసు శాఖను దుర్వినియోగం చేయడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. జనసేన పార్టీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులను చంద్రబాబు ఖండించినందుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫోన్లో సంభాషించారని, ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారని పవన్ పేర్కొన్నారు. మద్దతుగా నిలిచిన సోము వీర్రాజు, బీజేపీ జాతీయ కార్యదర్శులు సునీల్ దేవధర్  , సత్య కుమార్ కు పవన్ ధన్యవాదాలు చెప్పారు. ఎమ్మెల్సీ మాధవ్ నోవాటెల్ వెళ్లి పవన్ కు సంఘీభావం తెలిపారు.