Minsiter Amarnath On GIS : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్ చూసే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదిక వద్ద శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంబానీ, అదానీ, జిందాల్, ఒబెరాయ్, జీఎంఆర్, కృష్ణ ఎల్లా, భజంగా వంటి పారిశ్రామిక ప్రముఖులు రాష్ట్రంలో పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను గురించి ఎంత పాజిటివ్ గా మాట్లాడారో తెలుగు ప్రజలంతా చూశారన్నారు. ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుందని మంత్రి తెలిపారు. కరోనా సమయాన్ని కూడా తట్టుకొని, నిర్ణీత సమయం కన్నా ముందే పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏ విధంగా చొరవ తీసుకుందో పారిశ్రామికవేత్తలు చెప్పిన మాటలు కూడా కళ్లు ఉండి చూడలేని, నోరు ఉండి మాట్లాడలేని వారికి ఏం చెబుతామని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు.
90 శాతం పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా ప్రయత్నాలు
జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని పారిశ్రామికవేత్తలు నమ్ముతున్నారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. రాష్ట్రంలోని సహజ వనరులను, వర్క్ ఫోర్స్ ని చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తరలి వచ్చారని చెప్పారు. 14 సెక్టార్లలో పెట్టుబడులు వస్తాయని ఆశించామని, అవి 20 వరకు పెరగటం తమకు మరింత ఆనందంగా ఉందని అమర్నాథ్ చెప్పారు. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి ఘనతగా ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం వచ్చిన ఈ పెట్టుబడులలో కనీసం 90 శాతం గ్రౌండ్ అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఒక్కో పరిశ్రమకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి, పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా చూడాలని సీఎం గట్టిగా చెప్పారని ఆయన అన్నారు.
ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు
పెద్ద ఎత్తున పారిశ్రామిక సదస్సు విజయవంతంగా జరుగుతున్నా.. కొంతమంది దీనిపై విమర్శలు చేయడం శోచనీయమని మంత్రి అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయటానికి అచ్చెన్నాయుడు ప్రయత్నిస్తున్నారన్నారు. నేటి సదస్సుకు వచ్చిన పారిశ్రామిక ప్రముఖులను వారు ఎప్పుడైనా చూశారా? అని అమర్నాథ్ ప్రశ్నించారు.
పెయిడ్ బ్యాచ్ తో చప్పట్లు- అచ్చెన్నాయుడు
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ లో దిగ్గజ కంపెనీల అధిపతులు, ప్రతినిధులు పాల్గొన్నారు. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా ప్రతినిధులు కూడా ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ... కియా పరిశ్రమ 2017లో రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టిందని, కియా పరిశ్రమ 20 వేల ఉద్యోగాలు తెచ్చింది 2017లో అన్నారు. కియా పరిశ్రమను రాష్ట్రానికి తీసుకువచ్చింది టీడీపీ హయాంలో అని కియా ప్రతినిధులు సమ్మిట్ లో చెప్పారన్నారు. ఇందులో సీఎం జగన్ చేసింది ఏముంది ప్రశ్నించారు. పెయిడ్ బ్యాచ్ ను పిలిపించుకుని చప్పట్లు కొట్టించుకోవడమే జగన్ చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు.