Kapu Nadu Meeting : విశాఖలో రాధా - రంగా అసోసియేషన్ పేరుతో  కాపు నాడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర, ఇతర  జిల్లాలకు చెందిన  కాపు నేతలు పాల్గొన్నారు.  ప్రధాన రాజకీయ పార్టీల నేతలు కాపు సంఘాల ముఖ్య నేతలు సభకు దూరంగా ఉన్నారు. ఈ సభకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు,  కార్పొరేటర్లు , మహాసేన రాజేష్ హాజరయ్యారు. పార్లమెంట్ లో కాపు రిజర్వేషన్ పై మాట్లాడినందుకు జీవీఎల్ కు సన్మానం చేశారు. ఈ సమావేశంలో జీవీఎల్ మాట్లాడారు.  కొద్దిమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారని అటువంటి వాళ్లలో ఒకరు వంగవీటి మోహనరంగా అని గుర్తుచేసుకున్నారు.  ఈ సామాజిక వర్గాన్ని గిరిగిసి నించో పెట్టారన్నారు. ఆ గీత నుంచి బయటికి వస్తేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. కొంతమంది నాయకులకు పదవులు పోతాయని భయపడుతున్నారన్నారు. సభకు వెళ్ళొద్దని కొంతమందిని భయపెట్టారని ఆరోపించారు. అలాంటి వాటి నుంచి బయటకు రావాలని జీవీఎల్ సూచించారు. సామాజిక వర్గ కోటాలో మాత్రమే పదవులు లభిస్తున్నాయి తప్పితే నోరు మెదిపే అధికారంలేని పరిస్థితి అన్నారు. 


జిల్లాకు రంగా పేరు పెట్టమని కోరితే స్పందిచలేదు  


"ఏ సామాజిక వర్గానికి కాపలా కాయాల్సిన అవసరం లేదు. బయటికి వచ్చి చెప్పాలి. ఈ ప్రభుత్వంలో ఉన్న కాపులు కూడా పై నుంచి చెప్తే ప్రెస్ మీట్ లు ఉదరగొడతారు. ఇప్పుడు ముందుకెందుకు రావడం లేదు. వైయస్సార్, ఎన్టీఆర్ పేరుతో జిల్లాలు పెట్టారు. వంగవీటి రంగా పేరు పెట్టమని కోరితే ఎంతమంది ముందుకు వచ్చారు. ఉంటే మేము ఉండాలి లేదా మీరు ఉండాలి. అనే తీరులోని మాత్రమే రాష్ట్రంలో ఉన్నారు. వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని బీచ్ రోడ్ లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక అధికారులు కోరుతున్నాను." - ఎంపీ జీవీఎల్ 


పార్టీ గిరి నుంచి బయటకు రావాలి 


రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు స్టాలిన్  సినిమాలో విలన్‌ను గిరిలో మాదిరి కాపు నాయకులను గిరిగీసి పెట్టారని ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. అందుకే వంగవీటి రంగా వర్ధంతికి హాజరు కాకుండా నియంత్రించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కాపు నాయకులు అందుకే రాలేదన్నారు. పదవులకు ఆశపడిన నేతలు కాపు నాడు సమావేశానికి రాలేదని విమర్శలు చేశారు. సామాజిక న్యాయం కావాలంటే పార్టీలు గీసే గిరి దాటి బయటకు రావాలని సూచించారు. కాపులకు అధికారం లేని పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన నాయకుడు వంగవీటి రంగా అని ఎంపీ జీవీఎల్ అన్నారు. రంగా ఎదుగుదలకు భయపడ్డారంటే ఆయన సత్తా ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. ముప్పై సార్లు గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కనుమరుగయ్యారన్నారు. రంగా మాత్రం ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారన్నారు. బీసీ-డీ రిజర్వేషన్లు పొందడం ఉత్తరాంధ్రలో ప్రతీ కాపు హక్కు అన్నారు. కులం కోటాలో పోస్టులు తెచ్చుకుంటున్న మంత్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. వంగవీటి మోహన రంగా పేరును జిల్లాకు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఈ డిమాండ్‌ను వినిపించడంలో కాపు నాయకులు విఫలమయ్యారన్నారు.  


వైసీపీ నేతలు దూరం 


విశాఖ కాపు నాడు సమావేశానికి రాజకీయ పార్టీలు దూరంగా ఉన్నాయి. రాధా-రంగా అసోసియేషన్ పేరుతో విశాఖలో నిర్వహించిన సమావేశానికి వైసీపీ దూరంగా ఉంటాలని ముందే నిర్ణయించింది. ఆ పార్టీ నుంచి ఎవరూ సమావేశానికి హాజరుకాలేదు. అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలో వైసీపీ నేతలు హాజరుకాలేదని తెలుస్తోంది.  స్టేజ్ పై వైసీపీ నేతలు ఉన్న సమయంలో ఇతర పార్టీల నినాదాలు వస్తే ఇబ్బంది పడాల్సి ఉంటుందని ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.