CM Jagan : భూముల రీసర్వే అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం అని సీఎం జగన్ అన్నారు. వందేళ్ల తరువాత సర్వే అంటే, నూతనంగా చరిత్ర లిఖిస్తున్నట్లేనని జగన్ అభిప్రాయపడ్డారు.
జగనన్న శాశ్వత భూహక్కు
వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష (భూముల సమగ్ర రీసర్వే)పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా అధికారులుకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్, రాబోయే రోజుల్లో పనులను వేగవంతం చేయాలన్నారు. రీసర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నామని, వాటి ఫలాలు కచ్చితంగా ప్రజలకు అందాలన్నారు. సర్వేలో కచ్చితంగా నాణ్యత ఉండాలన్న సీఎం, దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతమంది సర్వేయర్లు, సర్వే సిబ్బంది మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారని చెప్పారు. తొలి విడతలో సర్వే పూర్తయిన 2 వేల గ్రామాలకు సంబంధించి భూహక్కు పత్రాలు అందించే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.
జనవరి నెలాఖరు నాటికి
జనవరి నాటికి సర్వే పూర్తి కావాలని, ముఖ్యమంత్రి జగన్ సూచించారు. తొలివిడత సర్వే పూర్తయిన 2వేల గ్రామాల్లో ఇప్పటివరకు 2 లక్షల మ్యటేషన్లు, 92 వేలు ఫస్ట్ టైం ఎంట్రీస్ జరగ్గా, 7,29,000 మందికి భూహక్కు పత్రాలు అందజేశామన్న అధికారులు, 4.30 లక్షల సబ్ డివిజన్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. 19 వేల భూవివాదాలను పరిష్కారమయ్యాయన్న అధికారులు, ఫలితంగా ప్రజలకు రూ.37.57 కోట్ల మేరకు ఆదా అయిందని వెల్లడించారు. మరో 2 వేల గ్రామాల్లో రీసర్వే ప్రక్రియకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సీఎంకు వివరింంచారు అధికారులు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నాటికి సర్వే పూర్తి చేస్తామని తెలిపిన అధికారులు, అదే నెల చివరికల్లా భూహక్కు పత్రాలను కూడా అందజేస్తామని వివరించారు.
ఇబ్బందులకు తావు లేకుండా....
సమగ్ర సర్వే కార్యక్రమం సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. గ్రామ సచివాలయంలో కావల్సినంత మంది సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని, దీని కోసం సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ కావాల్సిన సిబ్బందిని నియమించుకోవాలన్న సీఎం, ఖాళీలున్నచోట వెంటనే నియామకాలు చేపట్టాలని వివరించారు. 22– ఏ సమస్య పరిష్కరించి హక్కు పత్రాలు అందజేసిన లబ్ధిదారులకు లేఖలు రాయాలని అన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి వారికి జరిగిన మేలును తెలియజేసేలా.. లబ్ధి పొందిన ప్రతి వారికి వ్యక్తిగతంగా లేఖ రాయాలని సీఎం అన్నారు.
సర్వే రాళ్లు ఇలా
సమావేశంలో పాల్గొన్న అధికారులు సర్వే రాళ్లపై వివరాలను జగన్ ముందు ఉంచారు. సర్వేరాళ్ల ఉత్పత్తి వేగం పెంచాలన్న సీఎం, సమగ్ర భూసర్వే ప్రక్రియను మరింత వేగవంతంగా చేపట్టాలని వివరించారు. భూగర్భ గనులశాఖ అధికారులు సర్వే రాళ్ల ఉత్పత్తి పెరిగేలా అదనపు ఏర్పాట్లు చేసుకోవాలని, మార్చి కల్లా సర్వేకు అవసరమైన రాళ్లు సిద్ధంగా ఉంచుతామని అధికారులు వివరించారు. ఇందు కోసం అవసరమైన ప్రొడక్షన్ కెపాసిటీనీ మైనింగ్ శాఖ పెంచుకోవాలన్నారు. ఇందులో ఎలాంటి జాప్యానికి తావుండ కూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు.
అర్భన్ ప్రాంతాల్లో సర్వేపైనా సీఎం సమీక్ష
123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 4119 వార్డు సచివాలయాల్లో ఇప్పటికే సర్వే కోసం అవసరమైన బృందాల ఏర్పాటు, శిక్షణ పూర్తయిందన్న అధికారులు, హద్దుల మార్కింగ్, రోవర్ల సహాయంతో జీసీపీ ఐడెంటిఫికేషన్ ప్రక్రియను 2023 జనవరి నెలాఖరునాటికి పూర్తిచేస్తామని వివరించారు. ఇప్పటివరకు 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 1,16,685 ప్రభుత్వ, పోరంబోకు ల్యాండ్ పార్సిల్స్‌కు సంబంధించి 3,37,702 ఎకరాలు భూమిని గుర్తించామన్న పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ అధికారులు,జూలై 2023 నాటికి పట్టణ ప్రాంతాల్లోనూ సమగ్ర సర్వే హక్కు పత్రాల పంపిణీ పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.