Pawan Kalyan  విశాఖ రుషికొండ చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి రుషికొండను ధ్వంసం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం అదనపు తవ్వకాలు లేవంటోంది. అయితే ప్రతిపక్షాలను మాత్రం రుషికొండను పరిశీలించేందుకు అనుమతించడలేదు. ఇటీవల టీడీపీ నేతలు రుషికొండ తవ్వకాలను పరిశీలించేందుకు ప్రయత్నించగా వారిని అడ్డుకున్నారు పోలీసులు. జనసేన అధినేత పవన్ ఇటీవల విశాఖ పర్యటన సందర్భంగా రుషికొండ తవ్వకాలపై ఆరోపణలు చేశారు. అక్రమ తవ్వకాలు బయటపడతాయనే తన పర్యటనను అడ్డుకున్నారని ఆరోపించారు. అయితే ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు విశాఖ వచ్చిన పవన్ కల్యాణ్.. శుక్రవారం రాత్రి ప్రధానితో భేటీ అయ్యారు. విశాఖలోనే ఉన్న పవన్ రుషికొండ తవ్వకాలు పరిశీలించేందుకు వెళ్లారు. 






కొండ చుట్టూ బారికేడ్లు 


శనివారం సాయంత్రం రుషికొండ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు. అయితే తవ్వకాలు జరుపుతున్న ప్రాంతాల చుట్టూ బారికేడ్లు నిర్మించి లోపల జరుగుతున్న పనులు బయటకు కనిపించకుండా చేశారని పవన్ ఆరోపించారు. రుషికొండను  మింగేస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరును కనులారా వీక్షించామని పవన్ అన్నారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం రుషికొండను పరిశీలించడానికి వెళ్లగా, కొండ చుట్టూ బారికేడ్లు పెట్టి లోపల పనులు చేస్తుండటంతో బయట నుంచి కొండపై జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఉప్పాడ బీచ్ లో కాసేపు పవన్ సరదాగా గడిపారు. నాదెండ్ల మనోహర్ తో కలిసి బీచ్ లో నడుస్తూ ఆహ్లాదంగా గడిపారు.


రుషికొండ చుట్టూ రాజకీయాలు 


ఆంధ్రప్రదేశ్‌లో వివాదాస్పదంగా మారిన రుషికొండ  అక్రమ తవ్వకాల విషయంలో నిబంధనలను అతిక్రమించామని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అంగీకరించింది. తాము మూడు ఎకరాల మేర అదనంగా తవ్వకాల జరిపామని తెలిపింది. అయితే పిటిషనర్లు మాత్రం మూడు కాదని ఇరవై ఎకరాల మేర అదనంగా తవ్వారని ఆరోపించారు. దీంతో హైకోర్టు సర్వే చేయాలని ఆదేశించింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. 
 
మూడు ఎకరాలు అదనపు తవ్వకాలు  


విశాఖలో సముద్రం ఒడ్డున ఉండే రుషికొండలో గతంలో టూరిజం రిసార్ట్స్ ఉండేవి. వాటిని కూల్చి వేసి.. కొండను మొత్తం తవ్వేశారు. అక్కడ టూరిజంకు సంబంధించిన పెద్ద హోటల్ కడుతున్నామని చెప్పుకొచ్చారు. అయితే పర్యావరణ నిబంధనలు అన్నింటినీ ఉల్లంఘించి రుషికొండలో తవ్వకాలు జరుపుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.  అయితే ప్రభుత్వం మాత్రం అనుమతి ఉన్న వరకే తవ్వుతున్నామని వాదించింది. కానీ 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే, 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటీషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు మ్యాపులు సమర్పించారు. గత విచారణలో హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం తీరుపై అనుమానం వ్యక్తం చేసింది. తవ్వకాలకు సంబంధించి ఏదో దాస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేసింది. దీంతో తమకు అఫిడవిట్ దాఖలు చేయడానికి కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది నిరంజన్ కోరారు. ఆ మేరకు నవంబర్ మూడో తేదీన ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో మూడు ఎకరాలు అదనంగా తవ్వామని అంగీకరించింది. కానీ అంతకు మించి తవ్వారని పిటిషనర్లు వాదించడంతో సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సజావుగా సర్వే నిర్వహిస్తే ప్రభుత్వ బండారం బయట పడుతుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.