Bandaru Satyanarayana : చంద్రబాబు పవన్ కల్యాణ్ భేటీతో తాడేపల్లిలో సీఎం జగన్ కు బీపీ పెరిగిందని మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముందు ముందు బాహుబలులు చాలా మంది చంద్రబాబుని కలుస్తారని, అప్పుడు జగన్ కు హార్ట్ ఎటాక్ వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజలు టీడీపీ జనసేన కలయికను కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా వైసీపీ పాలనకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలవాల్సిందే అన్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మంత్రులు హద్దులు మీరి మాట్లాడుతున్నారని ఆరోపించారు.
సీఎం జగన్ నిద్రపట్టలేదేమో?
"చంద్రబాబు, పవన్ గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం జగన్ కు లేదు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏనాడైనా కోర్టు మెట్లు ఎక్కారా? , వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసు వేసి ఎందుకు డ్రాప్ అయిపోయారు. చంద్రబాబు అధికారంలో లేకపోయినా ప్రధాని కూడా ఆహ్వానిస్తు్న్నారు. పవన్ కల్యాణ్ ప్రజలకు సేవచేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రోజు ఎన్టీఆర్ ఎలా సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారో ఇవాళ పవన్ కల్యాణ్ కూడా అలాగే రాజకీయాల్లో వచ్చారు. పవన్ ఏమైనా అవినీతి చేశారా? చంద్రబాబు పవన్ భేటీతో రాత్రి సీఎం జగన్ నిద్రపట్టుండదు. వణుకుపుట్టి ఉంటుంది. సీఎం జగన్ కు అధికారం పోతుందని బాధకాదు మళ్లీ జైలుకు పోవాలని ఆందోళన చెందుతున్నారు" - బండారు సత్యనారాయణ మూర్తి
వైసీపీ నేతలకు జీవో నెం 1 వర్తించదా?
"ఏపీలో బీఆర్ఎస్ పై సీఎం జగన్ ఎందుకు మాట్లాడడంలేదు. కేసీఆర్ గురించి మాట్లాడితే హైదరాబాద్ లో జగన్ వ్యాపారాలు, లొసుగులు బయటపెడతారు. బీజేపీ గురించి మాట్లాడితే కేసులు. అందుకే సీఎం జగన్ భయపడుతున్నారు. పప్పు యాదవ్, పూలందేవి కూడా ఎన్నికల్లో గెలిచారు. అదే ప్రజాస్వామ్యంలో ఉన్న బ్యూటీ. ఒక్కొసారి దొంగలు కూడా గెలుస్తారు. చరిత్రలో కూడా ఈ విషయాలు చూశాం. నిన్న పవన్ చంద్రబాబు భేటీ ఒక రాక్షసపాలన అంతం చేసేందుకే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే. కేడీ నెం 1 జీవో నెం 1 తీసుకొచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి అంటారు అన్ని పార్టీలకు జీవో వర్తిస్తుందని, నిన్న రాజమండ్రిలో మంత్రులు, ఎంపీ రోడ్ షో నిర్వహించారు. వాళ్లపై ఎందుకు కేసులు పెట్టలేదు. కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తే ఎందుకు అడ్డుకున్నారు. కేసులు ఎందుకు పెట్టారు. ప్రభుత్వాలు తెచ్చే చట్టాలు ఏకపక్షంగా ఉండకూడదు. అందరికీ సమానంగా వర్తించాలి. ఈ జీవోతో సింహంలాంటి ప్రతిపక్ష నేతలను బంధించాలని చూస్తున్నారు. కానీ అది అసాధ్యం. " -బండారు సత్యనారాయణ మూర్తి
ప్రత్యేక హోదా ఏమైంది?
జయప్రశాశ్ నారాయణ్ తర్వాత ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ పెట్టి జాతీయ స్థాయిలో చక్రం తిప్పారని బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. మధ్యలో అధికారం కోల్పోయినా ఇందిరా గాంధీకి బెదరలేదన్నారు. ఆ తర్వాత పార్టీ పగ్గాలు తీసుకున్న చంద్రబాబు కూడా మధ్యలో అధికారం కోల్పోయినా వైఎస్ఆర్ కు బెదరలేదన్నారు. ప్రజల అత్యధిక మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం వైసీపీకి ఇచ్చారని, దిల్లీ నడిబొడ్డున సీఎం జగన్ ప్రత్యేక హోదాపై పోరాడగలరా అని సవాల్ చేశారు. రైల్వే జోన్ పై పోరాడగలరా ? అని ప్రశ్నించారు. జగన్ క్యాబినేట్ అంతా స్క్రిప్ట్ చదివేవాళ్లన్నారు. సీఎం జగన్ సింగిల్ వెళ్లారని చెబుతున్నారు కదా కేంద్రంపై ఎందుకు పోరాడలేకపోతున్నారని విమర్శించారు.