FPIs - Indian IT stocks: Primeinfobasel.com డేటా ప్రకారం... ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) 2022 క్యాలెండర్‌ సంవత్సరంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (IT) సెక్టార్‌ మీద విరక్తి చెందారు. గత ఏడాదిలో ఇండియన్‌ IT స్టాక్స్‌లో తమ పెట్టుబడులను భారీగా తగ్గించారు. ఈ కారణం వల్లే IT స్టాక్స్‌లో భయంకరమైన ప్రైస్‌ కరెక్షన్‌ను మార్కెట్‌ చూసింది.


గత ఏడాది కాలంలో... ఇన్ఫోసిస్ (Infosys), టీసీఎస్‌ (TCS), విప్రో (Wipro) వంటి జాతి రత్నాలు సహా ₹72,000 కోట్ల విలువైన ఐటీ షేర్ల మార్కెట్‌లో అడ్డంగా అమ్మేశారు. ఈ అమ్మకాల తర్వాత, 2022 డిసెంబరు 31 నాటికి, విదేశీ సంస్థల మొత్తం పెట్టుబడుల్లో IT రంగం ఎక్స్‌పోజర్‌ 15.43% నుంచి 10.45%కి పడిపోయింది. అంటే, తమ పోర్ట్‌ఫోలియో నుంచి ఏకంగా 5 శాతం ఐటీ స్టాక్స్‌ను ఒక్క ఏడాదిలోనే డంప్‌ చేశారు.


ఐటీ రంగాన్ని దెబ్బకొట్టిన కారణాలివి
ఐటీ రంగానికి అత్యంత కీలకమైన US, & యూరప్‌ దేశాల్లో ముసురుకున్న మాంద్యం మేఘాలు, సాంకేతిక వ్యయాలకు క్లయింట్ల నుంచి తక్కువ కేటాయింపుల వంటి ఆందోళనలతో ఓవర్సీస్ ఫండ్ మేనేజర్లు గత సంవత్సరం ప్రారంభం నుంచీ IT స్టాక్‌లను డంప్ చేస్తున్నారు. 2022లో నిఫ్టీ ఇండెక్స్ 1% లాభపడితే, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ (Nifty IT index) పోలిస్తే 25% క్షీణించింది.


బలహీనపడిన రూపాయి, తగ్గిన అట్రిషన్‌ రేట్‌ (ఉద్యోగ వలసల శాతం) వంటి సానుకూలాంశాల వల్ల మూడో త్రైమాసికంలో (Q3FY23) IT కంపెనీలు తమ మార్జిన్‌లు కొంత మెరుగవుతాయని భావిస్తున్నప్పటికీ, 2023 క్యాలెండర్‌ సంవత్సరంలో ఆదాయ వృద్ధి తగ్గుతుందన్నది ఎక్స్‌పర్ట్‌ల అంచనా.


IT స్టాక్స్ కాకుండా... క్యాపిటల్ గూడ్స్, టెక్స్‌టైల్స్ స్టాక్‌లకు కూడా FPIలు ఎక్స్‌పోజర్‌ తగ్గించారు. అందువల్లే గత ఏడాది ఈ రెండు రంగాల పనితీరు బలహీనపడింది. 2022లో, ఆర్థిక సేవల రంగంలో ₹61,000 కోట్ల విలువైన షేర్లను, కన్స్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్‌లలో ₹12,900 కోట్ల విలువైన షేర్లను ఫారిన్‌ ఇన్వెస్టర్లు విక్రయించారు.


ఓవరాల్‌గా అన్ని రంగాలను పరిగణనలోకి తీసుకుంటే... FPIలు 2021లో ₹55,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. 2022లో దానికి మూడు రెట్లు, ₹1.5 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.


FPIలు విపరీతంగా కొన్న స్టాక్స్‌ 
2022 క్యాలెండర్‌ సంవత్సరంలో ఐటీ స్టాక్స్‌, క్యాపిటల్ గూడ్స్, టెక్స్‌టైల్స్‌ను సాధ్యమైనంత వరకు వదిలించుకున్న విదేశీ మదుపుదార్లు.. కొన్ని రంగాల మీద మాత్రం మక్కువ చూపించారు. మెటల్స్, మైనింగ్, కన్‌స్ట్రక్షన్‌, ఆయిల్ & గ్యాస్ షేర్లను కొనుగోలు చేశారు. 


లోహాలు, మైనింగ్‌ రంగాల్లో FPIల సెక్టోరల్ ఎక్స్‌పోజర్ డిసెంబర్ 2021లోని 2.05% నుంచి డిసెంబర్ 2022లో 3.57%కి పెరిగింది. అదే విధంగా... ఆటో & ఆటో అనుబంధ రంగాల స్టాక్‌లకు విదేశీయుల కేటాయింపులు గతేడాది 4.07% నుంచి 5.35%కి పెరిగాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.