Visakha Daspalla Lands : విశాఖ దసపల్లా భూములపై  రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దసపల్లా భూమిని ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది. 2009లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఫాలో అవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ భూములు ప్రభుత్వానికి చెందినవి అంటూ గతంలో ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ నివేదిక పంపారు. దీంతో ఈ భూములకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్లాన్ అప్రూవల్, రిజిస్ట్రేషన్ పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ఈ భూముల వ్యవహారంపై రాణి కమలాదేవి అనే మహిళ గతంలో హైకోర్టు,  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతే కాకుండా ఈ భూములను టీడీపీ నేతలు ఆక్రమించుకుంటున్నారoటూ వైసీపీ నేతలు ఆందోళన చేశారు. స్వయంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కూడా ఆనాడు విశాఖలో ఆందోళన చేపట్టారు. 


దసపల్లా భూకుంభకోణం రూ.4 వేల కోట్లు


దసపల్లా భూకుంభకోణం రూ.4 వేల కోట్లు ఉంటుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. తాము తప్పనిసరిగా అధికారంలోకి వస్తామని, వచ్చిన తర్వాత అక్రమమని తేలిన పక్షంలో ట్విన్ టవర్స్ లా  కూల్చేస్తామని ఆయన హెచ్చరించారు. జగన్ కి దమ్ము ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఓటర్లు నమోదులో గ్రామ వాలంటీర్లు పాల్గొంటున్నారని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. దీనిపై ఈసీ కి ఫిర్యాదు చేస్తామన్నారు. రైల్వే జోన్ విషయంలో బీజేపీ అన్యాయం చేస్తుందనే పిచ్చి కూతలు కూస్తున్నారన్నారు.  కొన్ని మీడియా సంస్థలు కూడా అసత్య ప్రచారం చేస్తున్నాయని వాటిని ఖండిస్తున్నామన్నారు. త్వరలోనే రైల్వే జోన్ కి శంకుస్థాపన చేస్తామని తెలియజేశారు. 


దసపల్లా భూములపై సీబీఐ ఎస్పీకి ఫిర్యాదు


దసపల్లా భూములపై సీబీఐ విచారణ జరపాలంటూ సీబీఐ ఎస్పీకి పిర్యాదు చేశారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. వైసీపీ ప్రభుత్వం అడ్డంగా కోట్ల రూపాయలు దోచేస్తుందని మండిపడ్డారు. విశాఖ దసపల్లా భూములపై ఉన్న 22ఏ ఆంక్షలను‌ అకస్మాత్తుగా ఎత్తివేయడంపై టీడీపీ, సీపీఐ ఆగ్రహం చేశాయి. వేర్వేరుగా ధర్నాలకు పిలుపునిచ్చాయి.  విశాఖ దసపల్లా హిల్స్ వద్ద శనివారం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ, సీపీఐ శ్రేణులు వేరువేరుగా ధర్నాలకు పిలుపివ్వడంతో భారీగా పోలీసులను మోహరించారు. దసపల్లా భూములపై ఉన్న 22ఏ ఆంక్షలను‌ అకస్మాత్తుగా  ఎత్తివేయడంపై టీడీపీ, సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దసపల్లాకు వెళ్లే సర్క్యూట్ హౌస్ జంక్షన్  వద్ద నిరసనలు తెలిపాయి. రాజధాని పేరుతో భూములు కాజేయడం సిగ్గు అంటూ నినాదాలు చేపట్టారు. దీంతో దసపల్లా హిల్స్ కు వెళ్లే మార్గాల వద్ద హైటెన్షన్‌‌‌ నెలకొంది. 


వైసీపీ కీలక నేత హస్తం! 


 సీపీఐ నగర కార్యదర్శి పైడిరాజు  మాట్లాడుతూ దసపల్లా హిల్స్ భూములపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను కొందరు పెద్ద వ్యక్తులకు కట్టబెట్టడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మాట్లాడుతూ దసపల్లా భూములు కొట్టేయడానికి ఒక బూటకపు కంపెనీ పెట్టారని మండిపడ్డారు. వైసీపీ కీలక నేత కూతురు , కుమారుడు  రూ.9.75 కోట్లు లావాదేవీలు చేసినట్టు ఆధారాలు ఉన్నాయన్నారు. ఉత్తరాంధ్రలో ఏ భూమి కబ్జా జరిగినా క్రిమినల్ కేస్ పెట్టమని అధికారులను ఆదేశించారని, మరి ఇప్పుడు కేసు  పెట్టమంటారా చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో విచారణ జరగాలని, విశాఖ పరిపాలన రాజధాని పేరు చెప్పి ఇక్కడి భూములను కొట్టేస్తున్నారని, మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అక్రమంగా కొట్టేస్తారా అంటూ మండిపడ్డారు.  


వైసీపీ నేతలపై ఆరోపణలు 


అనంతరం టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ దసపల్లా హిల్స్ భూములపై సీబీఐ, ఈడీలతో విచారణకు డిమాండ్ చేశారు. వైసీపీలో పెద్దలు భూములను కాజేసేందుకు 22ఏ నుంచి తొలగింపజేశారన్నారు. వేల కోట్ల విలువైన భూములను 30, 70 నిష్పత్తిలో డెవలపర్స్ కు లబ్దిచేకూర్చేలా ఒప్పందం చేసుకున్నారని, చట్టంలో లోపాలను అడ్డం పెట్టుకుని విలువైన భూములను కాజేద్దామనే దుర్బుద్దితో ఉన్నారని మండిపడ్డారు. భూములను కాపాడుకునేందుకు పోరాటం చేస్తామని, వేలాది మంది తమ భూములను 22ఏ నుంచి తొలగించాలని చేసుకున్న దరఖాస్తుల పట్ల ఎందుకు శ్రద్దచూపడం లేదని  ఆయన ప్రశ్నించారు