AP BJP Fire On YSRCP : ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్పేర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ల ద్వారా మూడేళ్లలో ఎంత మందికి లబ్దిచేకూర్చారని, ఎన్ని నిధులు ఖర్చుచేశారో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, బీసీలను అన్ని విధాలుగా మోసం చేసిందని ఆయన విమర్శించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో మూడేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లకు పనిలేకుండా పోయిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. పేరుకు 3 ఎస్సీ వెల్పేర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లు, 56 బీసీ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లను ఏర్పాటుచేసి వైకాపా నాయకులకు ఈ కార్పొరేషన్‌ల ఛైర్మన్‌లు, సభ్యుల పదవులిచ్చి, జీతాలిచ్చి, కార్పొరేషన్‌లకు మాత్రం నిధులివ్వకుండా ఆయా వర్గాలను వంచించిందన్నారు.
బలహీనవర్గాలకు రూపాయి సాయం చేయకుండా కార్పొరేషన్‌ల పేరుతో అప్పులు తెచ్చి ఆ నిధులను దారి మళ్లించిందన్నారు. ఈ కార్పొరేషన్‌ల ద్వారా స్వయం ఉపాధి పథకాలు, జీవోనాపాధి పథకాలు, పారిశ్రామిక ప్రోత్సాహక పథకాలను అమలుచేయకపోవడంతో లబ్దిపొందుదామనుకున్న ఆయా వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. కార్పొరేషన్ ద్వారా అమలుచేసే పథకాలకు ఇప్పటి వరకు ఎంత ఖర్చుచేశారో ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా పథకాలను పేదలందరికీ అమలుచేయక, కొన్నివర్గాలకు మాత్రమే పరిమితం చేయడం సరికాదన్నారు.ఈ పథకంలో కూడా కుల, మతాలకు ప్రాధాన్యత ఇచ్చి రాజకీయం చేయవద్దని విమర్శించారు. లబ్దిదారులైన వధూవరులిద్దరూ పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలనే నిబంధన విధించడం సమంజసం కాదన్నారు. చదువుకున్న వారికి ప్రభుత్వం డబ్బులివ్వాల్సిన అవసరం లేదని, వారు పనిచేసుకుని బతుకుతారని, పేదలకు ఇవ్వాలని సూచించారు.
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్ధిక వ్యవస్థ అంధకారంలో లోకి వెళ్లిందన్నారు. మూడేళ్లుగా మౌలిక సదుపాయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం నిధులు వెచ్చించడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. కేంద్రం నిధులకు లెక్కలు చెప్పడం లేదని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ప్రజాపోరు సభల్లో ప్రతీ రోజూ ఒక్కో కీలకమైన విధానపరమైన అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజాపోరు సభలు రోజులు ఐదు వందలకుపైగా నిర్వహిస్తున్నారు. ఒక్క శనివారం రోజే 686 ప్రజాపోరు వీధి సభలు నిర్వహించినట్లుగా ప్రజాపోరు సభలకు ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు.
భారీ బహిరంగసభలు కాకుండా స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ల ద్వారా ప్రజల్ని కలుసుకునేందుకు బీజేపీ ప్రజాపోరు సభల్ని నిర్వహిస్తోంది. ఆయా కాలనీల వారికి బీజేపీ అధికారంలోకిరావాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని బీజేపీ నేతలు కూడా చెబుతున్నారు.