Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడంలేదని కేంద్రం ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో క్రెడిట్ గేమ్ స్టార్ట్ అయింది. మా పోరాటం వల్లే కేంద్రం ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిందని తమ ఖాతాల్లో వేసుకుని పనిలో పడ్డాయి రాజకీయ పార్టీలు. స్టీల్ ప్లాంట్ విషయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఓ ట్వీట్ చేశారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.  




లక్ష్మీనారాయణ ట్వీట్ 


"సింగరేణికి చెందిన ఒక బృందాన్ని పంపడం ద్వారా వైజాగ్ స్టీల్ ఈవోఐలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ధన్యవాదాలు. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రస్తుతానికి ప్రైవేటీకరణకు వెళ్లకూడదని , RINLని బలోపేతం చేయాలని ఆలోచించడానికి కారణం అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం బిడ్‌లో పాల్గొనాలి" అని లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. 




విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నలు 


సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్ పై బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. ఏపీపై నీటిపారుదల కేసుల సంగతేంటి? , ఏపీకి తెలంగాణ నుంచి రావాల్సిన పెండింగ్‌ సొమ్ము ఎంత? ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసుల దాడి సంగతి ఏంటి?
కేసీఆర్ నిజంగా ఏపీ శ్రేయోభిలాషి అయితే ఇలా చేసి ఉండేవారు కాదంటూ ట్వీట్ చేశారు. కావాలంటే లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ లో చేరవచ్చన్నారు. 


కేసీఆర్ పోరాటం వల్లే కేంద్రం వెనక్కి తగ్గింది- కేటీఆర్ 


 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే స్పష్టం చేశారు.  ఇప్పటికిప్పుడు ప్రైవేటు సంస్థలకు అమ్మే ప్రక్రియ చేయడం లేదన్నారు. ఈ విషయంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్ పడిందని, ఏపీలో బీఆర్ఎస్ సాధించిన తొలివిజయం ఇదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకుంటామ‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారన్నారు.  సీఎం కేసీఆర్ పోరాటంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు.  ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడింది కేసీఆరే అన్నారు. బీఆర్ఎస్ తెగించి కొట్లాడింది కాబ‌ట్టే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై కేంద్రం వెన‌క్కి త‌గ్గింద‌న్నారు. కేసీఆర్ దెబ్బ అంటే అట్లా ఉంట‌ుంద‌ని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.