మచిలీపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సభ పూర్తిగా విఫలం అయిందని మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని) అన్నారు. ఆ సభకు జనాలు రాక చంద్రబాబు షాక్ కు గురయ్యారని అన్నారు. అసలు మచిలీపట్నానికి వచ్చే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు. సీఎంగా ఉన్న సమయంలో మచిలీపట్నానికి ఏం చేశావని అన్నారు. బందరు పోర్టు కడతానని 2014 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి మర్చిపోయారని విమర్శించారు. గురువారం (ఏప్రిల్ 13) ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. చంద్రబాబు తనపై అసత్య ఆరోపణలు చేశారని, తనపై చేసిన ఆరోపణలు తప్పని నిరూపిస్తానని అన్నారు. దమ్ముంటే డిబేట్‌కు విజయవాడకు రావాలని చంద్రబాబుకు పేర్ని నాని సవాలు విసిరారు.


నమ్మకానికి సీఎం జగన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అయితే.. వెన్నుపోటుకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. మచిలీపట్నానికి ఔటర్‌ రింగ్‌ రోడ్డు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అన్నావ్‌.. తెచ్చావా? అని ప్రశ్నించారు. బందరును హైదరాబాద్‌ మించిన సిటీ చేస్తానన్న విషయాన్ని గుర్తు చేశారు. మే నెలలో సీఎం జగన్ బందర్ పోర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని, శరవేగంగా బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేస్తారని అన్నారు. చంద్రబాబు పచ్చి రాజకీయ మోసగాడు అని, నీరు - చెట్టు పథకంలో భాగంగా చంద్రబాబు రూ.2 వేల కోట్లు కాజేశారని ఆరోపించారు. 


హల్వా తిన్నట్లు తినేశారు - నాని


పేర్ని నాని అనేవాడికి చెయ్యి చాపి అడిగే అలవాటు లేదని.. పాపపు సొమ్ము తన ఇంటి గుమ్మం దాటదని అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రజల సొమ్మును చంద్రబాబు అండ్ కో బందరు హల్వా తిన్నట్టు తినేశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కేది ప్రజల సంక్షేమం కోసమని, సొంత సంక్షేమం కోసం కాదని నాని అన్నారు. రాష్ట్రానికి పట్టిన అంటు రోగం, దరిద్రం చంద్రబాబేనని, 2014 నుండి 2019 పాలన మళ్ళీ తీసుకుని వస్తానని దమ్ముగా చెప్పగలరా?అని పేర్ని నాని ప్రశ్నించారు.


‘‘చంద్రబాబును మించిన సైకో ఎవరున్నారు? పిల్లనిచ్చిన మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. బామ్మర్ధిలను తడి గుడ్డలతో గొంతు కోసిన వాడు సైకో కాదా? జన్మభూమి కమిటీల పేరుతో పచ్చచొక్కా వాళ్లకు దోచిపెట్టారు. చంద్రబాబు మళ్లీ తన పాలన తెస్తానని ప్రజలకు చెప్పగలరా? జన్మభూమి కమిటీలను మళ్లీ ప్రవేశపెట్టగలరా? తాను చేసిన ఒక్క మంచి పనైనా చెప్పగలరా? రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై అవాస్తవ ప్రచారం చేస్తున్నార’’ని పేర్ని నాని నిప్పులు చెరిగారు.


నిన్న మచిలీపట్నంలో చంద్రబాబు పర్యటన


టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం (ఏప్రిల్ 13) మచిలీపట్నంలో పర్యటించారు. ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి అనే కార్యక్రమంలో పాల్గొని హిందూ కాలేజీలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. చంద్రబాబు నాయుడు మూడు స్తంభాల సెంటర్‌ నుంచి హిందూ కాలేజీలోని సభావేదికను చేరుకొని ప్రసంగించారు. కోనేరు సెంటర్‌కు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, నగర ప్రజలు వచ్చారు. సభ ముగిసిన వెంటనే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరు వెళ్లి బస చేశారు. నేడు (ఏప్రిల్ 13) నిమ్మకూరులో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.