MP CM Ramesh : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును వైసీపీ నేతలే అంగీకరించడం లేదని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. స్వయంగా వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ఈ విషయంపై స్పందించి ఇది మంచి పనికాదన్నారని తెలిపారు. వైఎస్ వివేకానంద హత్య కేసు సాక్ష్యాలు తారుమారు చేశారని సీఎం రమేష్ ఆరోపించారు. 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని చెబుతున్న వైసీపీని ప్రజలు విశ్వసించడంలేదన్నారు. అవినీతి, అక్రమాలు పాల్పడుతున్న వైసీపీ నేతలను రాష్ట్ర ప్రజలు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతోందన్నారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పటికంటే మెరుగైన జీతాలు, జీవన ప్రమాణాలు మెరుగు పడేలా కేంద్రం ఆలోచిస్తోందన్నారు.
అమరావతే రాజధాని
"అమరావతే రాజధాని. అమరావతి రైతుల పాదయాత్రకు రక్షణ కవచంలా మేము ఉంటాం. వారితో పాటు మేము నడుస్తాం. అమరావతి యాత్రపై దాడి చేస్తే బీజేపీపై దాడి చేసినట్టే. అసెంబ్లీలోనే రైతుల పాదయాత్రపై సీఎం జగన్ స్వయంగా బెదిరిస్తున్నారు. వైసీపీ చేసే తప్పు పనులను, కేంద్రానికి చెప్పి చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఇది అవాస్తవం. ప్రధాని పునాది వేసిన రాజధానిని అడ్డుకుంటున్నారు. దాన్ని కేంద్రం ఎలా అంగీకరిస్తుంది?." - ఎంపీ సీఎం రమేష్
ఎన్టీఆర్ ను అగౌరవపర్చినట్లే
'ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సరైన నిర్ణయం కాదు. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ఇప్పుడు పేరు మారిస్తే కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు తీసేసుకున్నట్లే. ఎందుకంటే మీరు ఒక దారి ఇచ్చినట్లు. ఈ నిర్ణయాన్ని వైసీపీ ఎమ్మెల్యేలే తప్పుబడుతున్నారు. ఎన్టీఆర్ పేరు తొలగిస్తే ఆయనను అగౌరవపర్చినట్లే. ఇలా ప్రజావ్యతిరేక పనులు చేస్తూ 175 సీట్లు గెలుస్తామని అంటున్నారు. ఏపీ ప్రజల్ని తక్కువగా అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో వారేంటో చూపిస్తారు. వచ్చే ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల్లో మూడు సీట్లు గెలుచుకుంటే గొప్ప. ప్రధాని పునాది వేసిన రాజధానిని కేంద్రం వద్దంటుందా?. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులకు ఎప్పుడూ కేంద్రం సమర్థించదు.' అని సీఎం రమేష్ అన్నారు.