IMD Rainfall Alert UP: ఉత్తర్‌ప్రదేశ్‌లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు 12 మంది వరకు చనిపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, గౌతమ్ బుద్ధ నగర్‌తో సహా దేశ రాజధాని ప్రాంతం (NCR)లో గురువారం భారీ వర్షం కురిసింది.


దిల్లీలో కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు నిలిచి పోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. శుక్రవారం కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. గురుగ్రామ్‌లోని అనేక ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 





  1. భారీ వర్షాల కారణంగా నోయిడా, గురుగ్రామ్‌లలో 1 నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. 

  2. గురుగ్రామ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ జిల్లాలోని అన్ని కార్పొరేట్ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలకు ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ఉద్యోగులను ఇంటి నుంచి పని (WFH) చేయాలని సూచించింది.

  3. గురుగ్రామ్ డిప్యూటీ కమీషనర్ నిశాంత్ కుమార్ యాదవ్ ట్వీట్ చేస్తూ, "గురుగ్రామ్ జిల్లా పరిపాలనా విభాగం అన్ని కార్పొరేట్ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలకు వారి ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయించాలని సలహా ఇచ్చింది" అని ట్వీట్ చేశారు.

  4. ఇటావా, కాన్పుర్ దేహత్, బండా జిల్లాల్లో వర్షాలకు సంబంధించిన ప్రమాదాలలో 12 మంది వరకు మృతి చెందారు. ఇందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. ఇటావాలోని వారి ఇంటిలోపల మట్టి గోడ కూలిపోవడంతో వారు మరణించారు.

  5. దిల్లీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. దీంతో 'ఎల్లో అలర్ట్‌' జారీ చేసింది.

  6. గత 24 గంటల్లో నగరంలో 72  మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇది సీజన్‌లో సాధారణం కంటే ఏడు డిగ్రీలు తక్కువగా నమోదైంది.

  7. దిల్లీ-జైపుర్ హైవే సహా పలు రహదారులు సగటున మూడు అడుగుల నీటిలో మునిగిపోయాయి.


Also Read: PFI Hartal: కేరళలో హైటెన్షన్- PFI హర్తాళ్‌తో ఉద్రిక్త పరిస్థితులు, వాహనాలు ధ్వంసం!


Also Read: BJP Election Campaign: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం BJP పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా?