BJP Election Campaign: 2022 ఆరంభంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా? కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్ సహా మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల కోసం భాజపా అత్యధికంగా రూ.340 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ గణాంకాలను ఎన్నికల సంఘం వెల్లడించింది.
అత్యధికంగా
ఈ ఏడాది ఆరంభంలో ఉత్తర్‌ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు భారీగా ఖర్చు చేశాయి. అత్యధికంగా భాజపా రూ.340 కోట్లు ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ రూ.194 కోట్ల మేర ఖర్చు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఖర్చుల వివరాలకు సంబంధించిన నివేదికను భాజపా ఇటీవల ఈసీకి సమర్పించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో
ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్, పంజాబ్ రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రచారాల నిమిత్తం భాజపా రూ.340 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఇందులో అత్యధికంగా యూపీ కోసం రూ.221 కోట్లు. ఉత్తరాఖండ్‌లో రూ.43.67 కోట్లు, మణిపుర్‌లో రూ.23కోట్లు, పంజాబ్‌లో రూ.36 కోట్లు, గోవాలో రూ.19 కోట్లు ఖర్చు చేసినట్లు భాజపా నివేదికలో తెలిపింది.
కాంగ్రెస్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రూ.194 కోట్లు ఖర్చు చేయగా, తృణమూల్ కాంగ్రెస్ రూ.47.54 కోట్లు, ఆప్ రూ.11.32 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయా పార్టీల నివేదికలు పేర్కొన్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు తప్పనిసరిగా తమ ఎన్నికల వ్యయాల నివేదికలను ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది.
ఫలితాలు
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యమైన యూపీలో వరుసగా రెండోసారి భాజపా ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 403 సీట్లలో భాజపా, అప్నాదల్ కూటమి 267 స్థానాలను కైవసం చేసుకొని స్పష్టమైన మెజారిటీని సాధించింది.
భాజపాకి 255 సీట్లు, అప్నాదల్‌కు 12 సీట్లు దక్కాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 312 సీట్లు సాధించిన కమలనాథులకు ఈసారి సీట్లు తగ్గినా ఓట్లు పెరగడం విశేషం.
ఎస్పీ కూటమికి
ఎస్పీ, ఆర్‌ఎల్డీ కూటమికి 119 స్థానాలు దక్కాయి. ఎస్పీ 111 స్థానాల్లో ఆర్‌ఎల్డీ 8 స్థానాల్లో విజయం సాధించాయి. 2017 ఎన్నికల్లో 47 స్థానాల్లో ఎస్పీ విజయం సాధించింది. కర్హాల్ స్థానంలో పోటీ చేసిన సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ 60 వేల మెజార్టీతో విజయం సాధించారు.
పత్తా లేదు
మరోవైపు భాజపా దెబ్బకు కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీలు కొట్టుకుపోయాయి. యూపీ చరిత్రలో ఎన్నడూలేనంత తక్కువ సీట్లు సాధించాయి. కాంగ్రెస్ రెండంటే రెండు సీట్లలో గెలుపొందితే, బీఎస్పీ ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 7 సీట్లు, బీఎస్సీ 19 సీట్లు పొందాయి. సీట్లు పెరగకపోగా దారుణంగా తగ్గడం ఆ పార్టీల శ్రేణులను నిరాశ పరిచింది.
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉత్తరాఖండ్, మణిపుర్, గోవాల్లోనూ భాజపా జయకేతనం ఎగురవేసింది.
Also Read: Congress President Election: 'ఎంత చెప్పినా రాహుల్ ఒప్పుకోలేదు- అందుకే పోటీ చేస్తున్నా'