MP GVL On Ysrcp : పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన...కేంద్రంపై నిందలు మోపాలని చూస్తే 2018లో టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుందని హెచ్చరించారు. వైసీపీ ఎంపీలు 2018లో ఏం జరిగిందో రీల్ వేసుకుని చూసుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రజావ్యతిరేకతను కేంద్రంపై నెట్టేందుకు వైసీపీ చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఏపీలో నాలుగేళ్ల పాలనలో వైసీపీ పూర్తిగా విఫలమైందని ఎంపీ జీవీఎల్ విమర్శలు చేశారు. కేంద్రం నిధులు ఇస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలేదని విమర్శించారు. పారిశ్రామిక నగరాల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడంలేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఏపీలో పాలన చాలా దయనీయ పరిస్థితిలో ఉందన్నారు. 


వైసీపీపై ప్రజావ్యతిరేకత 


"నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. ఈ విషయం ప్రజలకు స్పష్టం తెలిసిపోయింది. రాష్ట్రంలో ఉద్యోగులుక వేతనాలు పడడంలేదు. బహుశా చరిత్రలో మొదటిసారి ఏ తేదీకి జీతాలు పడతాయో, అసలు పడతాయో లేదో అన్న అగమ్యగోచర పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్ర పరిపాలన వ్యవస్థ చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. దీనికి వైసీపీ రాజకీయ మూల్యం చెల్లించుకోకతప్పదు. కేంద్రం అనేక ప్రాజెక్టులను రాష్ట్రానికి కేటాయిస్తే కనీసం తన వంతు బాధ్యతను పూర్తిచేయలేని చేతగాని ప్రభుత్వం వైసీపీ. రాష్ట్ర విభజన తర్వాత రూ.4800 కోట్లు రైల్వే బడ్జెట్ లో ఏపీకి కేంద్రం కేటాయించింది. కానీ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా చేతగాని ప్రభుత్వంలాగా వ్యవహరిస్తుంది. ఏపీ అభివృద్ధిపై వైసీపీకి చిత్తశుద్ధి లేదు. వైసీపీని ఏపీ ప్రజలు ఛీకొడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలు మానసికంగా సిద్ధమయ్యారు."- బీజేపీ ఎంపీ జీవీఎల్ 


టీడీపీకి పట్టిన గతే వైసీపీకి 


"పార్లమెంట్ లో వైసీపీ ఎంపీల తీరు చూస్తుంటే... ప్రజా వ్యతిరేకతను కేంద్రంపై నెట్టేద్దామని 2018లో ఎలాంటి చౌకబారు ప్రయత్నం జరిగిందో ఐదేళ్ల తర్వాత కూడా అదే ప్రయత్నం మళ్లీ జరుగుతోంది. విజయసాయిరెడ్డి, మార్గాని భరత్, వీళ్లందరూ అబద్దాలు మాట్లాడుతూ కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారు. పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయండి, వాటి మౌలిక సదుపాయాలు కేంద్రం చూసుకుంటుందని చెబితే ఎందుకు స్పందించడంలేదు. విశాఖలో పారిశ్రామిక నగరాన్ని కట్టడానికి భూసేకరణ చేశారా? ఎక్కడ భూదందాలు చేయాలని ఉన్న శ్రద్ధ, ప్రజలకు ఉపయోగపడే పారిశ్రామిక నగరాలు కట్టాలని వైసీపీకి ఉందా?. లేదా ఉన్న పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లగొట్టేందుకు మేము సిద్ధహస్తులం. ఇందులో వైసీపీకి పేటెంట్ ఉంది అని కొత్తగా అజెండా లేవనెత్తుతారా? వైసీపీ తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తే, వైసీపీకి కూడా అదే గతిపడుతుంది. బీజేపీ, జనసేన కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. 2024లో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో బీజేపీ, జనసేన ప్రభుత్వం.... డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. వైసీపీ గ్రాఫ్ చాలా డ్రాస్టిక్ గా పడిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరు యాత్రలు చేస్తాం." - ఎంపీ జీవీఎల్