Israel Protests:


న్యాయవ్యవస్థలో సంస్కరణలు..


ఇజ్రాయేల్‌లో కొద్ది రోజులుగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంపై భగ్గుమంటున్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ నినాదాలు చేస్తున్నారు. అక్కడి న్యాయ వ్యవస్థలో చేసిన మార్పులే ఈ ఆగ్రహానికి కారణం. అయితే...జడ్జ్‌ల జోక్యాన్ని తగ్గించేందుకే సంస్కరణలు చేపట్టాల్సి వచ్చిందని ప్రభుత్వం వివరణ ఇస్తోంది. అయినా ప్రజల ఆందోళనలు తగ్గడం లేదు. జడ్జ్‌ల నియామకంలో రాజకీయాలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని తేల్చి చెబుతున్నారు. ఈ మార్పుల కారణంగా హైకోర్టుపై పూర్తిగా రాజకీయ ప్రమేయం పెరుగుతుందని అంటున్నారు. 










ఏంటీ వివాదం..? 


సాధారణంగా సుప్రీంకోర్టులో జడ్జ్‌ల నియామకం కోసం ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందులో మొత్తం 9గురు సభ్యులుంటారు. ఇందులో ఇద్దరు లాయర్స్, ఇద్దరు పార్లమెంట్ సభ్యులు, ఇద్దరు కేబినెట్ మంత్రులు, ముగ్గురు సుప్రీం కోర్టు జడ్జ్‌లు ఉంటారు. సుప్రీంకోర్టు జస్టిస్‌గా ఓ వ్యక్తిని నియమించాలంటే ప్యానెల్‌లోని 7గురు అంగీకారం తెలపాలి. అయితే...ఇందులో పూర్తిగా మార్పులు చేయాలని చూస్తోంది నెతన్యాహు సర్కార్. ఈ ప్యానెల్‌లోని సభ్యుల సంఖ్యను 11కి పెంచాలని భావిస్తోంది. అంటే ప్రభుత్వానికి సంబంధించి ఓ మంత్రి, పార్లమెంట్ సభ్యుడు కూడా ఇందులో సభ్యులుగా మారతారు. ఇన్‌డైరెక్ట్‌గా ప్రభుత్వ జోక్యం పెరిగినట్టే. జడ్జ్‌ను నియమించాలంటే వీరి మద్దతు కూడా అవసరమే. తమకు అనుకూలమైన వ్యక్తిని సుప్రీంకోర్టు జడ్జ్‌గా నియమించుకునేందుకు ప్రభుత్వానికి అవకాశముంటుంది. అందుకే అక్కడి ప్రజలు అంత పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నెతన్యాహు కేవలం తన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకే ఇలాంటి మార్పులు చేస్తున్నారంటూ మండి పడుతున్నారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు నెతన్యాహు. ఇలాంటి సమయంలో న్యాయ వ్యవస్థలో సంస్కరణలు చేస్తుండటంపై అసహనం వ్యక్తమవుతోంది.