Accused Identified in Viskaha MRO Murder Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ (Visakha) జిల్లా మధురవాడ కొమ్మాదిలో (Kommadi) తహసీల్దార్ దారుణ హత్యకు సంబంధించి నిందితున్ని గుర్తించినట్లు విశాఖ సీపీ రవిశంకర్ (Ravi Shankar) వెల్లడించారు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఇద్దరు ఏసీపీలను నియమించినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు వివరాలను శనివారం మధ్యాహ్నం మీడియాకు వివరించారు. 'ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన నిందితుడిని గుర్తించాం. నిందితుడు ఎయిర్ పోర్ట్ వైపు ప్రయాణించినట్లు గుర్తించాం. టికెట్ బుక్ చేసినట్లు ఆధారాలు లభించాయి. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి అన్ని ప్రాంతాల్లోనూ గాలింపు చర్యలు చేపట్టాం. చాలాసార్లు ఎమ్మార్వో ఆఫీస్ కు నిందితుడు వెళ్లినట్లు తేలింది. త్వరలోనే నిందితున్ని పట్టుకుంటాం.' అని సీపీ స్పష్టం చేశారు. 

Continues below advertisement


అదే కారణమా.?


శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ హత్య జరిగిందని.. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి వెంటనే వెళ్లారని సీపీ తెలిపారు. ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని భావిస్తున్నట్లు చెప్పారు. 'రియల్ ఎస్టేట్, భూ వివాదాలే హత్యకు కారణమై ఉండొచ్చు. హత్యకు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. తనతో మాట్లాడడానికి వచ్చిన వారికి తహసీల్దార్ సెండాఫ్ చెప్పడానికి వెళ్లగా.. అదే అదనుగా నిందితుడు హత్య చేశాడు.' అని సీపీ వివరించారు.


ఇంటికెళ్లి మరీ దారుణ హత్య



విశాఖ జిల్లా రూరల్‌ (చినగదిలి) తహసీల్దార్‌గా పని చేస్తూ ఉన్న సనపల రమణయ్యకు ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు కిందట విజయనగరం బదిలీ అయింది. మొదటి రోజు విధులకు హాజరైన రమణయ్య రాత్రి 8 గంటలు సమయంలో ఇంటికి చేరుకున్నారు. కొమ్మాదిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ఆయన ఇంటికి రాత్రి సుమారు 10.15 గంటలు సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి ఫోన్‌ చేశారు. ఫోన్‌ వచ్చిన వెంటనే వారిని కలిసేందుకు రమణయ్య కిందకు వచ్చారు. ఓ వ్యక్తితో ఏడు నిమిషాలపాటు సీరియస్‌గా చర్చించారు. ఇద్దరి మధ్య వాదనలు పెరగ్గా, బయటి నుంచి వచ్చిన వ్యక్తి తనతోపాటు తీసుకువచ్చిన ఇనుప రాడ్డుతో రమణయ్యను బలంగా బాదారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తహసీల్దార్‌ అక్కడికక్కడే కూలిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న రమణయ్యను అపోలో ఆస్పత్రి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మృతి చెందారు. కొమ్మాదిలోని ఎస్‌టీబీఎల్‌ సినీ థియేటర్‌ వెనక ఉన్న చరణ్‌ క్యాస్టల్స్‌ అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తులో నివాసం ఉంటున్నారు. రమణయ్యకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన సొంత ఊరు శ్రీకాకుళం జిల్లా నందిగామ మండల పరిధిలోని దిమ్మిలాడ గ్రామం. పదేళ్లు కిందట విధుల్లో చేరారు. డిప్యూటీ తహసీల్దార్‌, తహసీల్దార్‌, కలెక్టరేట్‌లో ఏవోగా పని చేశారు. వజ్రపుకొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్‌ చిన గదిలి ఎమ్మార్వోగా పని చేసి.. రెండు రోజులు కిందట విజయనగరం బదిలీపై వెళ్లారు. 


హత్యను ఖండించిన అసోసియేషన్‌


తహసీల్దార్‌ రమణయ్య హత్యను ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది. రమణయ్య కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని నాయకులు తెలియజేశారు. హత్యకు కారకులను వెంటనే అరెస్ట్‌ చేయాలని అసోసియేషన్‌ నాయకులు బొప్పరాజు, చేబ్రోలు కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించడంతోపాటు రమణయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అధిక భూ వివాదాలు ఉన్న మండలాల్లో పని చేసే తహసీల్దార్‌కు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించాలని, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినా, దాడులకు పాల్పడినా దోషులపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు తీసుకురావాలని కోరారు.


Also Read: DSC Candidates Protest: అనంతపురం కలెక్టరెట్ ముట్టడికి యత్నం, డీఎస్సీ అభ్యర్థుల అరెస్ట్‌తో ఉద్రిక్తత