Anantapur DSC Candidates Protest: అనంతపురం: ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ అని ఊదరగొట్టి, కేవలం 6 వేల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమను మోసం చేశారంటూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న డీఎస్సీ అభ్యర్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడికి యత్నించారు. తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట డీఎస్సీ అభ్యర్థులు నిరసనకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో కలెక్టర్ కార్యాలయం వద్ద డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన, నిరసనలతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. 


25 వేల డీఎస్సీ పోస్టు ఖాళీగా ఉంటే మినీ డీఎస్సీ నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తారంటూ డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికలు వస్తున్న తరుణంలో మినీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులతో రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో 23 మేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని.. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీని ప్రకటించి నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చి డీఎస్సీ  అభ్యర్థులను మోసం చేశారన్నారు. 


నాడు నేడు అంటూ స్కూళ్ళకి రంగులు వేస్తున్నారు తప్ప ఆ స్కూల్లో పాఠాలు చెప్పవలసిన టీచర్లను నడిరోడ్డుపై ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మినీ డీఎస్సీని రద్దుచేసి, దాదాపు 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో తప్పకుండా ముఖ్యమంత్రి స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డిని దింపుతామని చెబుతున్నారు. కలెక్టర్ కార్యాలయం వ్ద డిఎస్సీ అభ్యర్థుల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. డీఎస్సీ అభ్యర్థులు ఒక్కసారిగా కలెక్టర్ ఛాంబర్ లోకి దూసుకెళ్లి తమ సమస్యలను చెప్పేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు డీఎస్సీ అభ్యర్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌లకు తరలించేందుకు యత్నిస్తున్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లకు ప్రభుత్వం స్పందించి, మెగా డీఎస్సీ ప్రకటన చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.


మెగా డీఎస్సీ లేనట్లే..?
గతేడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 771 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సెప్టెంబరులో జరిగిన సమావేశాల్లో18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిల్లో 8,366 పోస్టులు మాత్రమే అవసరమని శాసనమండలిలో వెల్లడించారు. రాష్ట్రంలో 1,88,162 ఉపాధ్యాయ పోస్టులు ఉంటే 1,69,642 మంది పని చేస్తున్నట్లు ప్రభుత్వమే లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చింది. ఈ లెక్కన 18 వేలకు పైగా ఖాళీలున్నాయి. మంత్రి బొత్స మాత్రం 8,366 పోస్టులే అవసరమంటున్నారు. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం పోస్టుల సర్దుబాటు, వందశాతం పదోన్నతుల సాకుతో ఎత్తేసిందో స్పష్టత లేదు. కాగా తాజాగా కేవలం 6 వేల పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది.