విజయవాడ రాజకీయం మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్ అయింది. అధికార పార్టీకి చెందిన నేతలే బహిరంగ వేదికపై ఒకరినొకరు దూషించుకోవడం సంచలనంగా మారుతోంది. నువ్వెంతా అంటే నువ్వెంతా అంటూ మాటల తూటాలు పేల్చుకున్నారు. ఇదేదో సీట్ల పంచాయితీ కాదండీ బాబు... ఓ ఆహ్వాన పత్రిక కారణంగా బయట విభేదాలు.
వైసీపీ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. నా నియోజకవర్గంలోని వ్యక్తులతో నీకు ఏంటీ సంబంధం అంటూ దూషించుకున్నారు. ఇరువరు మాట మాట అనుకున్నారు. ఓ వివాహ ఆహ్వన పత్రికను సీఎంకు అందించటంలో మొదలైన వివాదం చివరకు తిట్టుకునే వరకు వెళ్లింది.
వెలంపల్లి వర్సెస్ సామినేని. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో లేటెస్ట్ వివాదం. వెలంపల్లి శ్రీనివాసరావు, సామినేని ఉదయ భాను ఇద్దరు కూడా వైసీపీ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు. వెలంపల్లి శ్రీనివాసరావు మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఉదయభాను కూడా మంత్రి పదవి ఆశిసించి ప్రయత్నించి విఫలమయ్యారు.
విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొప్పన భువకుమార్ జన్మదిన వేడుకలను ప్రైవేట్ పార్టీ కింద నిర్వహించారు. ఈ వేడుకలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వెలంపల్లి శ్రీనివాసరావు,సామినేని ఉదయ భాను ఒకరినొకరు తిట్టుకున్నారు. కార్యకర్తల మధ్యనే ఈ వివాదం జరగటంతో వాతావరణం అంతా ఒక్క సారిగా వైలెంట్‌గా మారింది.
తన నియోజకవర్గంలోని వ్యక్తులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్దకు తీసుకువెళ్ళటానికి నీవెవరంటూ జగ్గయ్యపేట శాసన సభ్యుడు ఉదయభానును ఉద్దేశించి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఉదయభాను తాను కూడా శాసన సభ్యుడినే కాబట్టి ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళేందుకు అర్హత ఉందని బదులిచ్చారు. దీంతో ఇరువురు నాయకులకు మధ్య మాటల యుద్దం మొదలైంది.
అక్కడే ఉన్న పార్టీ నాయకులు జోక్యం చేసుకొని ఇరువరిని పక్కు తీసుకువెళ్ళేందుకు ప్రయత్నించినప్పటికి ఫలితం లేకపోయింది. జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న తనకు సమాచారం లేకుండా నేరుగా ముఖ్యమంత్రిని కలవడంపై వెల్లంపల్లి అభ్యంతరం చెప్పారు. తన నియోజకవర్గానికి చెందిన నాయకులను వెంట పెట్టుకొని ఉదయ భాను వెళ్ళటంపై వెలంపల్లి తీవ్ర స్దాయిలో ఫైర్ అయ్యారు. దీంతో ఈ వ్యవహరంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
పెళ్ళి శుభలేఖపై రచ్చ...
విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు ఆకుల శ్రీనివాసరావు తన కుమారుడి వివాహానికి సంబంధించిన శుభ లేఖను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఆకుల శ్రీనివాసరావు తనకు సన్నిహితంగా ఉండే జగ్గయ్యపేట శాసన సభ్యుడు సామినేని ఉదయభానును సంప్రదించారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు. ముఖ్యమంత్రిని కలసిన సామినేని ఉదయభాను,ఆకుల శ్రీనివాసరావు శుభ లేఖను అందించారు. అయితే ఈ విషయంపై పశ్చిమ శాసన సభ్యుడు,ఎన్టీఆర్ జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న తనను ప్రదించకుండా చేయటంపై వెలంపల్లి శ్రీనివాసరావు కినుకు వహించారు. ఈ విషయం మనస్సులో పెట్టుకున్న వెలంపల్లి ఒక్కసారిగా ఉదయభాను కనిపించటంతో బయట పెట్టి ప్రశ్నించారు.
నలుగురిలో తనను ప్రశ్నించటంతో సామినేని ఉదయభాను తీవ్ర వేదనకు గురయ్యారు. ఆయన కూడా అదే స్థాయిలో వెలంపల్లికి కౌంటర్ ఇచ్చారు.ఇలా ఇరువురు కీలక నేతలు మాటలు అనుకోవటంతో క్యాడర్‌లో కూడా గందరగోళం ఏర్పడింది.
పార్టీలో కినుకు వహిస్తున్న సామినేని...
గతంలో జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్దీకరణలో మంత్రి పదవి దక్కుతుందని సామినేని ఉదయ భాను ఆశించారు. అయితే ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరకు జగన్ పిలచి సామినేని ఉదయ బానును సముదాయించారు. ఆ తరువాత నుంచి ఉదయభాను పార్టీలోని పలువురు నేతలపై అసహనంతో ఉన్నారు. ఇప్పుడు వివాదానికి కారణం కూడా నాటి అసహనమే అంటున్నాయి పార్టీ వర్గాలు.