YS Jagan On Tirupati Laddu : వంద రోజుల్లో అన్ని వర్గాలను ఏపీ సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. వాటి నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇది నిజంగా అన్నింటి కంటే ఎక్కువ ఆశ్చర్యం కలిగించే డైవర్షన్ అని, దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోవాలనే ఆలోచన ఉన్న చంద్రబాబు లాంటి అన్యాయమైన వ్యక్తి ఎవరూ ఉండరన్నారు. ఒకవైపున వంద రోజుల చంద్రబాబుపాలనపై ప్రజల్లో కోపం ఉంది. సూపర్ సిక్స్ స్కీమ్స్ ఏమయ్యాయని ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఇలాంటి టైంలో ప్రజలను డైవర్ట్ చేయడానికి అల్లిన కట్టుకథే ఈ కల్తీ కథ అని వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా... నెయ్యికి బదులు తిరుమల లడ్డూలో జంతువు కొవ్వు వాడారాని ఓ ముఖ్యమంత్రిగా మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా అబద్దాలు ఆడటం ధర్మమేనా. కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా తిరుమలేశుడి భక్తులు ఉన్నారు. అలవికాని హామీలు ఇచ్చి ప్రజలందరినీ దారుణంగా సమస్యల్లోకి నెట్టారని అన్నారు. అన్ని వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం చేశారు. విద్యార్థులకు విద్యా దీవెని ఇంకా రాలేదని దీని వల్ల కాలేజీ యాజమాన్యుల సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కాయి. సీబీఎస్‌ఈ విద్యను తీసేశారని’ మండిపడ్డారు.
వైద్య రంగం చూసుకున్న అదే పరిస్థితి కనిపిస్తోందన్నారు జగన్. ఆరోగ్య శ్రీ బిల్లు కోట్ల రూపాయలు పెండింగ్‌లో పెట్టారన్నారు. 108, 104 సిబ్బందికి ఇంత వరకు జీతాలు ఇవ్వలేదన్నారు. వైద్య కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు అడుగులు వేస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో రైతులు పూర్తిగా రోడ్డున పడ్డారని అన్నారు. ఇస్తానన్న 20 వేలు ఇంత వరకు ఇవ్వలేదని అన్నారు. తాము ఇచ్చే పెట్టుబడి సహాయం కూడా ఇవ్వలేదని అన్నారు. ఈ క్రాపింగ్, బీమా అన్నింటినీ పూర్తిగా ఆపేశారన్నారు. మళ్లీ ఎరువుల కోసం షాపుల ఎదుట రైతులు క్యూ కడుతున్నారని మాజీ సీఎం జగన్ విమర్శించారు.
వైసీపీ హయాంలో ప్రతి పథకం డోర్ డెలివరీ జరిగేదని... పారదర్శకంగా ఉండేదన్నారు. ఇప్పుడు అది కనిపించడం లేదని ఆరోపించారు. జన్మభూమి కమిటీల వద్దకు వెళ్లాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యమైపోయిందన్నారు జగన్. రెడ్ బుక్ పాలనలో అడ్డగోలుగా న్యాయాన్ని పాతరేసి ధర్మానికి రక్షణ లేకుండా ఇవాళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని... దొంగ కేసులు పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు పాలన చేస్తున్నారని విమర్శించారు.
అన్ని రకాలుగా ఫెయిల్ అయిన చంద్రబాబు ప్రభుత్వం... ప్రతి అడుగులో ప్రజలను, భక్తులను డైవర్షన్ చేస్తోంది. ఏ స్థాయికి చేరిందంటే... చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అరాకచక పాలనపై ధర్నా చేస్తే... మదనపల్లె ఫైల్స్ కేసు తీసుకొచ్చారని జగన్ గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ జరిగితే... చంద్రబాబు తొలిసారిగా సీఎం అయినట్టు సంబరాలు చేసుకొని డైవర్ట్ చేశారని చెప్పారు.
Also Read: Tirumala Laddu News | తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారు! టీటీడీ ఈవో శ్యామలరావు సంచలన వ్యాఖ్యలు