YS Jagan Latest News: ప్రజల కోసం పని చేస్తే ఎలా ఉంటుందో చూపించామని, ఇప్పుడు కార్యకర్తల కోసం పని చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు వైసీపీ అధినేత జగన్ అన్నారు. బెజవాడ వైసీపీ కార్పోరేటర్లతో సమావేశమైన జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల సందర్భంగా చెప్పినట్టుగానే పథకాలు అమలు చేయలేక చంద్రబాబు చేతులు ఎత్తేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

లండన్ నుంచి వచ్చిన తర్వాత తొలిసారిగా తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో నేతలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ఈ సమావేశంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం ఇకపై గట్టిగా పని చేస్తాను అని చెబుతూనే తప్పుడు కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు పెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పాలనపై ఫోకస్ పెట్టి కార్యకర్తలను విస్మరించిన వాట వాస్తవమేనని ఇకపై అలా జరగదని హామీ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు పెట్టిన కష్టాలు, బాధలు చూస్తున్నామని కచ్చితంగా అన్నింటికీ బదులు తీర్చుకుంటామని అన్నారు. 

Also Read: పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ - గురువారం కేబినెట్ భేటీకి కూడా దూరం !

అధికార పార్టీ నాయకులు దొంగ కేసులు పెడుతున్నారని, బెదిరిస్తున్నారని అయినా ఎవరూ భయపడొద్దని భరోసా ఇచ్చారు. ఈసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 ఏళ్లు పరిపాలిస్తామన్నారు. విలువలు విశ్వసనీయతతో రాజకీయాలు చేస్తున్నామని వాటిని ప్రజలు గుర్తిస్తున్నారని 9 నెలలు అయిన చంద్రబాబు సూపర్ సిక్స్‌ పథకాలు అమలు చేయలేదని గుర్తు చేశారు.  ఇలా జరుగుతుందని ఎన్నికల ప్రచారంలోనే చెప్పానని గుర్తు చేసారు జగన్. ఇప్పుడు అన్నీ ప్రజలకు గుర్తుకు వస్తున్నాయని ఈసారి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ఏరులై పారుతోందని ఊరికో బెల్టుషాపు నడుస్తోందని వాటినే ఎమ్మెల్యేలు నడిపిస్తున్నారని ఆరోపించారు జగన్. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ పని కావాలన్నా ఎమ్మెల్యేల నుంచి చంద్రబాబు వరకు ముడుపు చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. 

Also Read: సినీ హీరో వేణుపై కేసు పెట్టిన సీఎం రమేష్ - కాంట్రాక్టుల్లో వచ్చిన తేడాలే కారణం !

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయని కేసులు పెడతారని వాటిని చూసి భయపడిపోవద్దని అన్నారు జగన్. అలాగని వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని సూచించారు. అందుకు తానే ఉదాహరణ అని అన్నారు జగన్. టీడీపీ కాంగ్రెస్ కలిసి తనపై అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో కూడా ఉంచారని తర్వాత ఏం జరిగిందో అందరికి తెలుసని అన్నారు. ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు.  

లోకల్‌ సంస్థల ఎన్నికల్లో ఎవరూ సాధించలేని  విజయాలను వైసీపీ సొంతు చేసుకుందని వారిలో కొందర్ని కూటమి ప్రభుత్వం ప్రలోభాలు పెట్టి లాక్కుంటుందని అన్నారు జగన్. కొందరు మాత్రం వైసీపీకి మద్దతుగా నిలబడ్డారని గుర్తు చేశారు. అలా నిలబడిన వారిని చూసి గర్వపడుతున్నాను అన్నారు. ఇదంతా ప్రజల సహకారంతోనే సాధించామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారమన్నారు. ఎప్పుడు ఏ పథకం ఇస్తామో చెప్పి మరీ అమలు చేశామన్నారు. 

కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా సాకులు చెప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు జగన్. అందుకే వైసీపీ నేతలు, కార్యకర్తలు సగర్వంగా ప్రజల మధ్యకు వెళ్లగలుగుతున్నారని జగన్ అన్నారు. అన్ని కష్టాల్లో ప్రజలకు అండగా ఉండటంతో కాలర్ ఎగరేసుకొని తిరగుతున్నామని చెప్పుకొచ్చారు.  గెలిచిన 9 నెలలే అవుతున్నా ప్రజల మధ్యకు వెళ్లలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు గురించి అడుగుతున్నారని తెలిపారు. 

ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసు రాజ్యం నడుపుతున్నారని ఆరోపించారు జగన్. చంద్రబాబు నైజం ప్రజలకు పూర్తిగా అర్థమవుతుందని అందుకే వచ్చే ఎన్నికల నాటికి ఊహించని మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు. జమిలీ ఎన్నికలు అంటున్నారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విశ్వసనీయతతో ప్రజల ముందుకు వెళ్దామన్నారు. ఈసారి జగనన్న 2.0 చూస్తారని అన్నారు. కార్యకర్తల కోసం జగన్ పని చేస్తే ఎలాఉంటుందో చూస్తారని అన్నారు. కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు చూసిన తర్వాత అండగా ఉండాలని నిర్ణయించుకున్నానని అన్నారు. తప్పుడు కేసులు పెట్టే వాళ్లపై ప్రైవేటు కేసులు పెడతామన్నారు.