Defence Cluster in Andhra Pradesh | న్యూఢిల్లీ: ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ రెండో రోజు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఏపీ మంత్రి లోకేష్ బుధవారం నాడు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో లోకేష్ కోరారు. రక్షణ రంగానికి సంబంధించిన పరికరాల యూనిట్లు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేలా చూడాలన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన లోకేష్, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు.
ఏపీ రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు పనుల తాజా పరిస్థితిని రాజ్‌నాథ్ సింగ్‌కు మంత్రి నారా లోకేశ్ వివరించారు. అప్పుల్లో మునిగిన ఏపీకి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏపీని తిరిగి ట్రాక్‌లోకి తెస్తుందని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి సహకారం అందిస్తున్నందుకు ధన్యావాదాలు తెలిపిన నారా లోకేష్.. రక్షణ రంగ పరికరాల యూనిట్లు రాష్ట్రానికి వచ్చేలా చూడాలని కోరారు.

ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని, కలిసికట్టుగా డబుల్ ఇంజిన్ సర్కార్‌తో సమూల మార్పులు సాధ్యమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌తో పాటు ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, కేశినేని శివనాథ్ (చిన్ని) ఈ సమావేశంలో పాల్గొన్నారు.
విశాఖలో గూగుల్ క్లౌడ్ సెంటర్
ఏపీలో గూగుల్ క్లౌడ్ సెంటర్ కోసం నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్, కంట్రీ డైరెక్టర్ ఆశిష్ లతో నారా లోకేష్ ఢిల్లీలో భేటీ అయ్యారు. కలిశారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్, డేటా సిటీకి సంబంధించి వారితో చర్చలు జరిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో టెక్నాలజీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ సెంటర్ (AI Center) ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని నెలకొల్పాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ని ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేష్ కోరారు.