Due to viral fever Pawan is unlikely to attend the cabinet meeting on Thursday: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని జనేసన ప్రకటించింది. జ్వరంతోపాటు స్పాండిలైటిస్ బాధపెడుతోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు. వీటి మూలంగా గురువారం నాటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు హాజరు కాలేకపోవచ్చునని సీఎంవో కార్యాలయం తెలిపింది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొద్ది రోజుల నుంచి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారానికి కూడా ఆయన వెళ్లలేదు. ఎన్డీఏ కూటమి నేతలంతా ప్రచారం చేశారు. పవన్ ఎందుకు వెళ్లలేదో ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఆయన వ్యక్తిగత పర్యటన కోసం కొద్ది రోజులు సింగపూర్ వెళ్లారని చెబుతున్నారు. పూర్తిగా వ్యక్తిగత పర్యటన కావడంతో ఆ విషయం అధికారిక ప్రకటన చేయలేదు. పవన్ సతీమణి అన్నా లెజ్ నోవా.. పిల్లలు అక్కడే ఉంటున్నారు. పవన్ పిల్లలు అక్కడే చదువుతూండటంతో పవన్ కొద్ది రోజులు వెళ్లి కుటుంబంతో గడిపి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయాల సందర్శన పెట్టుకోవాలనుకున్నారు. బుధవారమే ఆయన కేరళ పర్యటనకు వెళ్తారన్న ప్రచాం జరిగింది.
అయితే హఠాత్తుగా ఆయన పర్యటన రద్దు అయింది. ఆలయాల సందర్శన కూడా పూర్తిగా వ్యక్తిగత పర్యటన కావడంతో అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆయన సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత అనారోగ్యం పాలయ్యారు. వైరల్ ఫీవర్ తో పాటు చాలా కాలంగా వేధిస్తున్న స్పాండిలైటిస్ సమస్య కూడా తిరగబెట్టిందని అంటున్నారు. ఈ కారణంగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. జ్వరం కారణంగా ఆయన హాజరయ్యే పరిస్థితి ఉండదని ముందుగానే సమాచారం ఇచ్చారు. అనవసర ఊహాగానాలు రాకుండా మీడియాకు కూడా ముందుగానే సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అధికారం చేపట్టిన తర్వాత .. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న పవన్ షెడ్యూల్ చాలా బిజీగా మారింది. రోజుకు పద్దెనిమిది గంటలు ఆయనకు పనులు ఉంటున్నాయి. కీలమైన శాఖలు ఆయన చేతిలో ఉండటం .. మరో వైపు రాజకీయాల కారణంగా అలసిపోతున్నారు. ఆ ఎఫెక్ట్ ఆరోగ్యంపై పడిందని చెబుతున్నారు. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత అటు సినిమాలు.. ఇటు రాజకీయాలతో చాలా బిజీగా ఉండేేవారు. ఇప్పుడు అది కంటిన్యూ అవుతోంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుని మళ్లీ యాక్టివ్ కావాలని జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు.
Also Read: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం - 4 డివిజన్లతో కొత్త రైల్వే జోన్