AP Minister Seediri Appalaraju: మనుషుల ఆరోగ్యంతో పాటుగా పశువుల ఆరోగ్యానికి సైతం భద్రత, భరోసా కల్పిస్తూ తద్వారా పాడి రైతులకు, పశువుల పెంపకందారులకు మేలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి దేనని  రాష్ట్ర పశు సంవర్థక, డెయిరీ, మత్స్య శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు అన్నారు. 
పశు సంరక్షణపై రాష్ట్ర స్థాయి సదస్సు...
ప్రపంచ పశువైద్య దినోత్సవం-2023 సందర్భంగా రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకందారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి లైవ్ స్టాక్ మిషన్ ద్వారా శాస్త్రీయ పద్ధతిలో గొర్రెలు, మేకల యాజమాన్యంపై  విజయవాడలో పశు సంవర్థక శాఖ నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మంత్రి అప్పలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ పశు వైద్య దినోత్సవం-2023 సందర్భంగా “పశువైద్య వృత్తిలో వైవిధ్యం, సమానత్వం, సమగ్రతను ప్రోత్సహించడం” అనే అంశం పై ఆయన సుదీర్ఘంగా చర్చించి విలువైన సలహాలు, సూచనలు అందించారు. నాలుగేళ్ల పశు సంవర్థక శాఖ సాధించిన పురోగతిని, సాధించాల్సిన ప్రగతిని, లక్ష్యాలను గురించి మంత్రి అప్పలరాజు వివరించారు.
నోరులేని జీవాలు దేవుడితో సమానం...
నోరు లేని మూగజీవాలకు సేవ చేయడం దేవుడిచ్చిన అదృష్టంగా భావించాలని సూచించారు. జీవాల సేవలో తరిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి అప్పలరాజు. తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశంలోని ప్రగతి ఆ దేశంలో ఉన్న పశువుల ఆరోగ్యస్థితిని బట్టి చెప్పవచ్చన్న మహాత్మా గాంధీజీ స్పూర్తితో పనిచేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డా.వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవ ద్వారా పశువులకు కూడా అంబులెన్స్ సేవలు తీసుకొచ్చామని మంత్రి అన్నారు. 
మూగ జీవాలు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు 1962 నంబర్ కు కాల్ చేస్తే సత్వరమే పశువుల అంబులెన్స్ లు పశువు ఉన్న ప్రాంతానికి వెళ్లి వైద్య సేవలందించడం గొప్ప సంస్కరణ గా అభిప్రాయపడ్డారు. పాడి పశువులతో పాటు గొర్రెలు, మేకలు వంటి జంతువులకు అత్యవసరమైన, నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. మందులతో పాటు పశువులను అంబులెన్స్ వాహనంలోకి ఎక్కించేందుకు వీలుగా హైడ్రాలిక్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. అవసరమైన పరిస్థితుల్లో దగ్గర్లోని ఏరియా పశువైద్యశాలకు పశువులను తరలించి సరైన వైద్యం అందించడం ద్వారా వాటిని ప్రాణాపాయం నుంచి రక్షించడం జరుగుతుందన్నారు. 
అమూల్ పాల వెల్లువతో రైతులకు ఆదాయం...
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ.పి అమూల్ పాలవెల్లువ ద్వారా రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఆటోమేటెడ్ పాలసేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అక్కచెల్లెమ్మలకు పాడి ఆవులు, గేదెల యూనిట్ల ఏర్పాటు, మెరుగైన జీవనోపాధి కల్పనలో భాగంగా సుస్థిర ఆదాయం చేకూర్చడమే లక్ష్యంగా జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ చేయూత ద్వారా ప్రత్యక్షంగా లబ్ధి పొందిన లబ్ధిదారులను, వారు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను చూసి సంతోషమేసిందన్నారు.
పాడి రైతులకు మేలు చేసే విధంగా రాష్ట్రంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు పునరుద్ధరించడమే గాకుండా వాటిని బలోపేతం చేసే లక్ష్యంతో అమూల్ తో ఒప్పందం చేసుకున్న విషయాన్ని మంత్రి వివరించారు. పాల ఉత్పత్తి దారులకు గిట్టుబాటు ధరను కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి లీటర్ పాలపై ప్రైవేట్ డెయిరీలతో పోల్చితే అదనంగా ఆదాయం కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పశు ఆరోగ్య సంరక్షణ కార్డులను జారీ చేసిన రాష్ట్రం తమదేనని, ఇదొక గొప్ప చర్య అని మంత్రి అభివర్ణించారు.  పశుసంవర్థక శాఖ ద్వారా అమలు చేస్తున్న వినూత్న పథకాల ద్వారా జీఎస్ డీపీ పెరిగిందని, అందుకు కారకులైన పశుపోషకులకు, పశు వైద్యులకు అభినందనలు తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు దేశ చరిత్రలోనే గొప్ప అధ్యాయం అన్నారు.