ఎన్టీఆర్ జిల్లాలో గ్రామ వాలంటీర్ మోసం చేశాడంటూ ఓ యువతి గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతోనే ఇలా జరిగిందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామంలో పిల్లి సతీష్ అనే వాలంటీర్ యువతితో ప్రేమాయణం సాగించాడు. ఇద్దరు చాలా క్లోజ్ రిలేషన్ వరకు వెళ్ళారు. పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి వాలంటీర్ పిల్లి సతీష్ సైలెంట్ అయిపోయాడు. అనుమానం వచ్చిన బాధితురాలు అతన్ని నిలదీసింది. చివరకు పెళ్ళి చేసుకునేందుకు వాలంటీర్ ఇష్టం లేదని తెగేసి చెప్పాడు. 


మోసపోయానని గుర్తించిన బాధితురాలు తీవ్ర మనోవేదనకు గురయ్యింది. ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్ళికి నిరాకరించిన వాలంటీర్ సతీష్ మోసం చేసిన విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. కొన్ని రోజులుగా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. చివరకు ఆత్మహత్యాయత్నం చేసింది. గొంతు కొసుకొని బలవన్మరణానికి పాల్పడింది బాధితురాలు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని నందిగామలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


పోలీసులు అదుపులో వాలంటీర్...
ప్రియురాలి ఆత్మహత్య విషయాన్ని తెలుసుకొని వాలంటీర్ పిల్లి సతీష్ కంగుతిన్నాడు. పారిపోయేందుకు ప్రయత్నించటంతో స్థానికులు అతన్ని పట్టుకున్నారు. ఈలోగా పోలీసుల సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాలంటీర్ పిల్లి సతీష్‌ను గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సతీష్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వాలంటీర్ అన్న కారణంగానే తప్పుడు ఆరోపణలతో రోడ్డుకు లాగుతున్నారని మండిపడ్డారు.


గుంటూరులో కూడా వారలంటీర్...
వాలంటీర్ల వ్యవహార శైలి పై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ మరో వాలంటీర్ దుశ్చర్యకు ఒడిగట్టాడు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం పంచాయతీ పరిధిలోని బాప్టిస్టు పాలెంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గాలిమోతు లోకేశ్ కుమార్ అనే వాలంటీరు తన చేయిపట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడని ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించారు. లోకేశ్ కుమార్ తన బంధువులతో కలిసి దాడికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేశారు. వాలంటీర్ గాలిమోతు లోకేష్ కుమార్‌తో పాటుగా అతని కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


వాలంటీర్ల చుట్టూ వివాదం...
వాలంటీర్లు ఇటీవల కాలంలో వరుసగా వార్తల్లోకి ఎక్కుతున్నారు. వాలంటీర్‌పై విమర్శలు, ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఓ గ్రామ వాలంటీర్ దాష్టీకానికి బాలుడు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రి పాలయ్యాడు. సిగరెట్లు తీసుకురాలేదనే కోసం బాలుడిని గ్రామ వాలంటీరు డాబాపై నుంచి తోసేయడం సంచలనం రేపింది. బాలుడి ఒక కాలు, చేయి విరిగి తీవ్ర గాయాలతో మంచాన పడ్డాడు. ఈ ఘటన జరిగిన తరువాత విషయాన్ని బయటకు రాకుండా దాచి పెట్టేందుకు ప్రయత్నించారు. అయినా పది రోజుల తరువాత విషయం వెలుగులోకి వచ్చింది.