Vijayawada: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక దివ్యాంగురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన అనంతరం అధికార ప్రతిపక్షాల మధ్య దుమారం చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. బాధితురాలిని పరామర్శించిన వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమకు మహిళా ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసులు కూడా జారీ చేశారు. 27న అంటే ఇవాళ వారిద్దరూ మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ, నోటీసులకు అనుగుణంగా ఇద్దరూ హాజరుకాలేదు.
అయితే, బుధవారం మహిళా మహిళా కమిషన్ ఛాంబర్‌లో ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma), మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత (Vangalapudi Anitha) మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ‘జగన్ పాలనలో ఊరికో ఉన్మాది’ పుస్తకాన్ని వాసిరెడ్డి పద్మకు అనిత అందించారు. 800కు పైగా జరిగిన అఘాయిత్యాల్లో ఎందరికి నోటీసులు ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు. పుస్తకాన్ని పరిశీలించి సమాధానం ఇస్తానని కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. అనిత ఆధ్వర్యంలో బుధవారం మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెలుగు మహిళలు ముట్టడించి, నిరసనలు తెలిపారు. తెలుగు మహిళల ముట్టడితో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చంద్రబాబుకు, బొండా ఉమకు నోటీసులు ఇచ్చే అధికారం మహిళా కమిషన్‌కు లేదని తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో విజయవాడ అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.
మహిళా కమిషన్‌కు ఆ అధికారం లేదు: బోండా ఉమ
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని వదిలేసి బాధితులకు అండగా నిలుస్తున్న తెలుగుదేశం నాయకులకు నోటీసులు ఇచ్చే అధికారం మహిళా కమిషన్‌కు లేదని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. తెలుగు మహిళా నాయకులతో కలిసి విజయవాడ ఆసుపత్రి అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులకు ఆయన రూ.5 లక్షల ఆర్థిక సాయం చేశారు. మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలకు నోటీసులివ్వడంలో ఉన్న శ్రద్ధ, బాధితులను ఆదుకోవడంలో ఉండాలని నిందితులను శిక్షించడంపై దృష్టి పెట్టాలని అన్నారు.
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చంద్రబాబు, బొండా ఉమా తనను తిట్టారని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ వారు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, నోటీసులు ఇచ్చే అధికారం మహిళా కమిషన్‌కు లేదని టీడీపీ తేల్చి చెప్పింది. తాను విచారణకు వెళ్లడం లేదని బొండా ఉమ చెప్పారు.