Vijayawada Hyderabad Traffic Diversion: విజయవాడ: దసరా ఉత్సవాలను భక్తులు, ప్రజలు ఇబ్బంది పడకూడదని విజయవాడ నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం నుండి అక్టోబరు 2వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని విజయవాడ కమిషనర్‌ రాజశేఖరబాబు తెలిపారు. వాహనాలు ఈ విషయాలు తెలుసుకుని నవరాత్రుల వరకు ట్రాఫిక్ మళ్లింపులు, నిబంధనలు పాటించాలని సూచించారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆనవాయితీ ప్రకారం సీపీ ఎస్.వి.రాజ శేఖర బాబు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Continues below advertisement


హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు
నల్లగుంట వద్ద నుండి వెస్ట్ బైపాస్ మీదుగా చిన్న ఆవుటపల్లి, హనుమాన్ జంక్షన్ వైపు వెళ్లాలి. విశాఖ నుంచి హైదరాబాద్ తిరుగుబాటు ప్రయాణం కూడా ఇదే దారిలో రావాలి


హైదరాబాద్ నుండి మచిలీపట్నం వైపు వెళ్లే వాహనాలు
నల్లగుంట దగ్గర నుంచి వెస్ట్ బైపాస్ ఎక్కి చిన్న ఆవుటపల్లి, కేసరపల్లి మీదుగా వెళ్లాలి. తిరిగివచ్చేటప్పుడు కూడా వాహనాలు ఇదే మార్గంలో ప్రయాణించాలి.






హైదరాబాద్ నుంచి గుంటూరు, చెన్నై వైపు వెళ్లే వాహనాలు
నార్కెట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, అద్దంకి, మేదరమెట్ల మీదుగా వాహనాలు రాకపోకలు సాగించాలి.


చెన్నై నుంచి విశాఖపట్నం వైపు రాకపోకలు
ఒంగోలు, త్రోవగుంట, చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లాలి.


ఉత్సవాల కోసం వాహనాల పార్కింగ్:
భవానీపురం వైపు నుండి వచ్చే వాహనాలు:
తితిదే పార్కింగ్, ఎంవీ రావు ఖాళీ స్థలం, పున్నమి ఘాట్, భవానీ ఘాట్, సుబ్బారాయుడు పార్కింగ్, సెంట్రల్ వేర్ హౌస్ గ్రౌండ్, గొల్లపూడి మార్కెట్ యార్డ్, భవానీపురం లారీ స్టాండ్, సోమా గ్రౌండ్, సితార సెంటర్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, గొల్లపూడి పంట కాలువ రోడ్డులో పార్క్ చేయవచ్చు.


గుంటూరు, మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ వైపు నుండి వచ్చే వాహనాలు
బీఆర్‌టీఎస్ రోడ్డు, సంగీత కళాశాల మైదానం, ఎఫ్‌ఐసీ మట్టి రోడ్డు పార్కింగ్, జింఖానా మైదానంలో వాహనాలు పార్కింగ్ చేయాలని విజయవాడ సీపీ సూచించారు.


విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మొత్తం 11 రోజులపాటు అమ్మవారు 11 రూపాల్లో దర్శనమిస్తారు. దసరా వేడుకల సందర్భంగా విజయవాడకు భక్తుల రద్దీ పెరిగింది. కనక దుర్గమ్మ సన్నిధికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. దసరా సెలవులు కూడా ఉండటంతో పిల్లలతో కలిసి పెద్దవారు విజయవాడ దుర్గమ్మను దర్శించుకుని పూజలు చేస్తున్నారు.