Weather Update: తెలుగు రాష్ట్రాలను దసరా వేళ మరింత దడ పుట్టించడానికి వరుణుడు రెడీ అవుతున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ, తెలంగాణ జనాలను బెంబేలెత్తిస్తోంది. కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఇప్పుడు మరింత తీవ్రం అవుతున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన శక్తిమంతమైన అల్పపీడన పరిస్థితులు కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత్ వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ప్రస్తుతం బంగాళాతంలో బలపడుతున్న అల్పపీడనం కారణంగా ఏపీ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ స్పష్టం చేసింది. అధికారులు, రైతులు, సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక బులెటిన్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ అలర్ట్
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలతోపాటు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. అల్పపీడనం ప్రభావం అత్యధికగా ఉండే ఉత్తరాంధ్ర జిల్లాలకు అత్యంత తీవ్రమైన రెడ్ అలర్ట్ ప్రకటించింది.
రెడ్ అలర్ట్ జిల్లాలు ఇవే
రాగల కొన్ని గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం అల్లూరి, విశాఖ, జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలకు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది.
ఆరెంజ్ అల్ట్, మోస్తారు వర్షాలు
అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మోస్తారు వర్షాలు కురిసినప్పటికీ పిడుగులు పడే ప్రమాదం ఉందని రైతులు, ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు
ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంటున్నారు అధికారులు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
భారీ ఈదురుగాలుల హెచ్చరిక
వర్షాలతోపాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు హోర్డింగ్స్ కింద, చెట్ల కింద,పాడుబడిన భవనాల కింద ఉండొద్దని హెచ్చరించింది.
తెలంగాణలో అతి భారీ వర్షాలు
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపుు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు రోజుల రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది.
సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు
వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో కూడా వానలు దంచికొట్టాయి.
మంగళవారం భారీ వర్షాలు
మంగళవారం నాడు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వివరించింది.
ఈ వర్షాల కారణంగా కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
సోమవారం వర్షాలతో అతలాకుతలం
తెలంగాణలో ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా సాధారణ జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. రహదారులపై నీరు నిలిచిపోయింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.
సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి, మెదక్, జనగాం,హైదరాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదైంది.
అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 16 సెంటీమీటర్‌ల వర్షం నమోదైంది. ఈ రికార్డులే వాతావరణ తీవ్రతను రాబోయే రోజుల్లో ఎదురుకాబోయే సవాళ్లను స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
మరో అల్పపీడనం ఈ నెల 25న తూర్పు మధ్య, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాత ప్రాంతంలో ఏర్పడే ఛాన్స్ ఉంది. ఈ అల్పపీడనం అక్కడితో ఆగకుండా మరింత బలపడి 26 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ బలపడిన వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 27న దక్షిణ ఒడిసా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం దాటే ఛాన్స్ ఉంది. ఇలా తీరం దాటే క్రమంలో తీరప్రాంత జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసేందుకు అవకాశం ఉందని పేర్కొంది.